ఆగస్టు 2 నుంచి బండి సంజయ్ పాదయాత్ర

ఆగస్టు 2 నుంచి బండి సంజయ్ పాదయాత్ర

సీఎం కేసీఆర్కు బై బై చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఈ నెల 21 నుంచి పల్లె గోస - బీజేపీ భరోసా పేరుతో యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. బీజేపీ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన.. అసెంబ్లీ  ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. నేతలు బైక్ ర్యాలీలు నిర్వహించి పల్లెల్లో సమస్యలు తెలుసుకుంటారని, ప్రతి నియోజకవర్గానికి ఒక ముఖ్య నేత వెళ్లేలా ప్లాన్ చేశామని తరుణ్ చుగ్ అన్నారు. వారంతా నియోజకవర్గంలో 10 రోజుల పాటు మకాం వేస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు పల్లె గోస - బీజేపీ భరోసా యాత్రం ఉంటుందని చెప్పారు. మొదటి విడతలో 30 నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించనున్నట్లు తరుణ్ చుగ్ ప్రకటించారు.

ఆగస్టు 2 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర
ఆగస్టు 2వ తేదీ నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుందని తరుణ్ చుగ్ వెల్లడించారు. మూడో విడతలో బండి సంజయ్ 20 రోజుల పాటు పాదయాత్ర చేస్తారని చెప్పారు. రెండు విడతల పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ 67 రోజుల్లో 828 కిలోమీటర్లు నడిచారు. 28 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.