హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏండ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈనెల 17 నుంచి నెల రోజుల పాటు 'సేవా సంకల్ప్ అభియాన్' నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వెల్లడించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గుజరాత్ సీఎంగా పన్నెండున్నర ఏండ్లు, ప్రధానిగా మరో పన్నెండున్నర ఏండ్లు కలిపి మోదీ పాతికేండ్ల ప్రజాసేవ పూర్తి చేసుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 17న మోదీ పుట్టినరోజు, తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈ అభియాన్ ప్రారంభమై అక్టోబర్ 17 వరకు కొనసాగుతుందన్నారు.
ఇందులో భాగంగా మొదటి రోజు సాయంత్రం కేంద్ర సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇండ్లలో దీపాలు వెలిగించే 'ఆశీర్వాద్ కా దియా' కార్యక్రమం చేపడతామని చెప్పారు. నెల రోజుల పాటు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్, వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు. 'మేరే సప్నో కా భారత్' పేరుతో మోదీ సేవా ప్రస్థానాన్ని వివరించే 30 నిమిషాల భావోద్వేగ నాటక ప్రదర్శనలను ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో దళారుల ప్రమేయం ఉండేదని, కానీ మోదీ జన్ ధన్, డీబీటీ ద్వారా ప్రతి రూపాయి నేరుగా పేదల ఖాతాల్లోకే జమ చేస్తున్నారని ప్రశంసించారు.
