తెలంగాణలో వచ్చే నెలలో బీజేపీ మరో భారీ సభ

తెలంగాణలో వచ్చే నెలలో బీజేపీ మరో భారీ సభ

హైదరాబాద్, వెలుగు: చేవెళ్ల సభ సక్సెస్ కావడంతో ఇంకిన్ని మీటింగ్స్​ నిర్వహించడంపై బీజేపీ దృష్టి పెట్టింది. పార్లమెంటరీ ప్రవాస్ యోజనలో భాగంగా రాష్ట్రంలోని అన్ని లోక్‌‌‌‌సభ నియోజకవర్గాల్లో భారీ సభలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర నేతలను హైకమాండ్ ఆదేశించింది. మరో 6 నుంచి 8 నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున ఈలోపే 17 లోక్‌‌‌‌సభ నియోజకవర్గాల్లో సభలను పూర్తిచేయాలని సూచించింది. కనీసం నెలకు 2 నుంచి 3 సభలు నిర్వహించడం సాధ్యమైతేనే 6 నెలల్లో పూర్తి చేయొచ్చని, వెంటనే ఈమేరకు దృష్టి పెట్టాలని రాష్ట్ర నేతలకు చెప్పింది. కొన్ని సభలకు కేంద్ర మంత్రి అమిత్ షా, ఇంకొన్నింటికి బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి, ఇతర సీనియర్ నేతలను ఆహ్వానించేలా రాష్ట్ర పార్టీ ప్లాన్ చేస్తున్నది. 

వచ్చే నెలలో మరో భారీ సభ

దక్షిణ భారతదేశం నుంచే ఈసారి ఎక్కువ పార్లమెంట్ సీట్లను గెలుచుకోవాలని బీజేపీ హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే పార్లమెంటరీ ప్రవాస్ యోజన ప్రోగ్రామ్ కింద సభలకు ప్లాన్ చేసింది. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలపై ఆందోళనలను కొనసాగిస్తూనే.. సభలను నిర్వహించాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి సూచించింది. దీంతో చేవెళ్ల సభ సక్సెస్ నేపథ్యంలో.. వచ్చే నెల మొదటి వారంలో మరో పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ సభను నిర్వహించి, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఆహ్వానించాలని రాష్ట్ర నేతలు యోచిస్తున్నారు. మే 10తో కర్నాటక ఎన్నికల హడావుడి ముగియనుండడంతో ఆ తర్వాత రాష్ట్రంపై బీజేపీ జాతీయ నాయకత్వం మరింత ఫోకస్ పెట్టనున్నట్లు నేతలు చెప్తున్నారు.