మరో రెండు రోజుల్లో బీజేపీ సెకండ్ లిస్ట్!

మరో రెండు రోజుల్లో బీజేపీ సెకండ్ లిస్ట్!
  • రాష్ట్రంలో మిగిలిన 8 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం
  •     మోదీ అధ్యక్షతన సమావేశమై చర్చించిన పార్టీ సీఈసీ
  •     ఇప్పటికే 9 సీట్లకు క్యాండిడేట్ల ప్రకటన

న్యూఢిల్లీ, వెలుగు:  బీజేపీ లోక్​సభ అభ్యర్థుల సెకండ్ లిస్ట్  ఒకటీ రెండురోజుల్లో రిలీజ్​ కానుంది. ఇందులో తెలంగాణ నుంచి దాదాపు మిగిలిన అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సోమవారం పార్టీ హెడ్ ఆఫీసులో ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ  సెంట్రల్​ ఎలక్షన్​ కమిటీ (సీఈసీ) మీటింగ్​ జరిగింది. ఈ భేటీలో నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్, కిషన్​రెడ్డి, తరుణ్​చుగ్​, లక్ష్మణ్, సునీల్ బన్సల్  పాల్గొన్నారు. కోర్ గ్రూప్ కమిటీలోని డీకే అరుణ, ఈటల రాజేందర్​, జితేందర్ రెడ్డి తదితరులను ఈ మీటింగ్ కు పిలువలేదు. ఇటీవల ప్రకటించిన ఫస్ట్​ లిస్టులో తెలంగాణలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 

ఇంకా ఎనిమిది సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తాజా భేటీలో తెలంగాణకు సంబంధించి మిగిలిన ఎనిమిది స్థానాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి చేరిన నలుగురు నేతలకు సెకండ్​ లిస్ట్ లో చాన్స్ ఉండొచ్చని అన్నారు. వీరిలో ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, నల్గొండ నుంచి సైదిరెడ్డి, మహబూబాబాద్​ నుంచి సీతారాం నాయక్ , ఆదిలాబాద్​ నుంచి జి.నగేశ్​ను పోటీలో దింపే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. అలాగే ఫస్ట్ లిస్ట్ లో పెండింగ్ లో పెట్టిన మహబూబ్ నగర్ స్థానంపై క్లారిటీ వస్తుందని  పేర్కొంటున్నాయి. అందుకే కోర్ గ్రూప్ లోని ముఖ్యనేతలు, ఆశావాహులు డీకే అరుణ, జితేందర్ రెడ్డిని ఈ మీటింగ్ కు పిలవలేదని అంటున్నాయి. ఇక గోమాసే శ్రీనివాస్ పార్టీలో చేరినప్పటికీ పెద్దపల్లి టికెట్​తనకు దక్కుతుందని కవి, గాయకుడు మిట్టపల్లి సురేందర్  భావిస్తున్నారు. 

మరోవైపు మెదక్ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి భర్త అంజిరెడ్డి పేరు గత వారం రోజులుగా ప్రచారంలోకి వచ్చింది. వరంగల్ స్థానం కోసం రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్ పేరును రాష్ట్ర నాయకత్వం బలపరిచినట్లు సమాచారం. ఆయనతో పాటు ఆరూరి రమేశ్, మరో ఇద్దరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. జాయినింగ్స్, లోకల్ ఇక్వేషన్స్, అనివార్య కారణాలు ఎదురైతే ఫైనల్ లిస్ట్ లో పలు మార్పులు ఉండే అవకాశమూ ఉందని బీజేపీ ముఖ్యనేత ఒక చెప్పారు. సెకండ్ లిస్ట్ లో దేశవ్యాప్తంగా దాదాపు 150 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని అన్నారు.