టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే - రాహుల్

టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే - రాహుల్
  • రాష్ట్ర రైతులను కేసీఆర్ ఆగం చేసిండు 
  • అధికారంలోకి వస్తే కౌలురైతు చట్టం అమలు చేస్తం
  • దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది 

దేశంలోనే అత్యంత అవినీతి సర్కార్ కేసీఆర్​దేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ టీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు. భారత్ జోడో యాత్రలో భాగంగా గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమయ్యారు. ఎన్మోనిపల్లి వద్ద కార్నర్ మీటింగ్​లో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు 100 శాతం పూర్తి కాకున్నా, అందులో టీఆరెసోళ్ల అవినీతి మాత్రం పూర్తయిందని రాహుల్ విమర్శించారు. ‘‘టీఆర్ఎస్​కు దోచుకోవడం అలవాటుగా మారింది. కాళేశ్వరంలో అడ్డగోలుగా అవినీతికి పాల్పడినా ఎవరూ పట్టించుకోలేదు”అని అన్నారు. ‘‘మియాపూర్​వద్ద రూ.15 వేల కోట్ల విలువైన ల్యాండ్​స్కామ్ చేసినా, దానిపై ఇంత వరకు ఎలాంటి ఎంక్వైరీ లేదు” అని మండిపడ్డారు. రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని.. వాళ్లను ఆగం చేశాడని ఫైర్ అయ్యారు. ‘‘ఇక్కడి రైతులను పలకరిస్తే, వారు చెబుతున్న బాధలు వింటుంటే ప్రభుత్వానికి వారి మీద కొంత కూడా ప్రేమ లేదనే అర్థమవుతోంది. రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వమే వారికి వ్యతిరేకంగా మారింది” అని మండిపడ్డారు. 

టీఆర్ఎస్, బీజేపీ దోస్తులు..   

టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని రాహుల్ ఆరోపించారు. నాణేనికి బొమ్మ, బొరుసు ఎట్లాగో.. ఆ రెండు పార్టీలు అట్ల అని విమర్శించారు. అవి రెండు శత్రు పార్టీలు కాదని, ఇది ప్రజలు గ్రహించాలని సూచించారు. ‘‘ఢిల్లీలో బీజేపీకి టీఆర్ఎస్.. తెలంగాణలో టీఆర్ఎస్​కు బీజేపీ సహకరిస్తోంది. ఈ పార్టీలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చాయి. ఇలాంటి చేష్టలతో ప్రభుత్వాలను పడగొడుతున్నాయి. ఢిల్లీలో మోడీ, తెలంగాణలో కేసీఆర్​అధికారంలో ఉండి ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. పార్లమెంటులో బీజేపీ ఏ బిల్లు పెట్టినా, దానికి టీఆర్ఎస్​మద్దతు ఇస్తోంది. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు చట్టాలకు మేం మద్దతు ఇవ్వలేదు. రైతుల పక్షాన నిలబడ్డాం. కానీ టీఆర్ఎస్ మాత్రం ఆ చట్టాలను సమర్థించి బీజేపీకి మద్దతుగా నిలిచింది” అని మండిపడ్డారు. 

ధరల పెరుగుదలతో జనం ఇబ్బందులు..  

దేశంలో, తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయిందని రాహుల్ అన్నారు. నిత్యావసరాల ధరలు పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘‘నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి కేంద్ర నిర్ణయాలతో చిన్నాచితక వ్యాపారులు నట్టేట మునిగిపోయారు. ఒకప్పుడు గ్యాస్​బండ ధర రూ.400 ఉంటే మోడీ మొత్తుకునేవాడు. మరిప్పుడు ఆయన ప్రభుత్వ హయాంలో రూ.1,100 కు చేరింది. దీనికి ఆయన ఏం సమాధానం చెబుతారు” అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల అవినీతి, హింసాత్మక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశంలో విస్తరిస్తున్న హింసను, విద్వేషాన్ని పోగొట్టి స్వచ్ఛమైన భారత్ ను నిర్మించాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.

రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు

రైతులు ధైర్యంగా ఉండాలని, ఆత్మహత్యలు చేసుకోవద్దని రాహుల్ అన్నారు. తాము అధికారంలోకి వస్తే కౌలురైతు చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బొందలకుంట వద్ద రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో కౌలు రైతులు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను రాహుల్ కు చెప్పుకున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 80 శాతం మంది కౌలు రైతులేనని, కానీ ప్రభుత్వం వాటిని రికార్డు చేయడం లేదని వాపోయారు. ధరణి పోర్టల్ పేదల పాలిట శాపంగా మారిందన్నారు. సమావేశ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని ప్రకటించారు. 

26 కిలోమీటర్లు యాత్ర...

రాహుల్ యాత్ర మక్తల్ సబ్ స్టేషన్ నుంచి ప్రారంభమైంది. పెద్ద చెరువు, దండు క్రాస్, కాచ్​వార్, బొందలకుంట, జక్లేర్, గుడిగండ్ల, ఎన్మోన్​పల్లి మీదుగా ఎలిగండ్లకు చేరుకుంది. మొత్తం 26 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగింది.