బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ గడగడలాడింది : ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ గడగడలాడింది : ఎమ్మెల్సీ కవిత

సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసి బీజేపీను గడగడలాడించారని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. బీజేపీ చౌకబారు ఎత్తుగడలను ప్రజలు తిప్పికొట్టి తగిన గుణపాఠం చెబుతారన్నారు. విద్వేషాన్ని ప్రోత్సహించడం, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయడం వంటివి టీఆర్ఎస్ చేయదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామన్న కల్వకుంట్ల కవిత... తెలంగాణ ప్రజలకు సేవ చేయడాన్ని తమను ఏ శక్తి ఆపలేదని రాసుకొచ్చారు.

లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు రావడం బీజేపీ నీచమైన, హీనమైన రాజకీయ ఎత్తుగడలో భాగమని అంతకుముందు ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్న ఆమె... మోడీ సర్కారు తనను జైల్లో పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చని అన్నారు. ప్రజల కోసం పనిచేయడం మాత్రం మానుకోమని స్పష్టం చేశారు. ప్రజల కోసం పని చేస్తున్నందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. దర్యాప్తు సంస్థలు వస్తే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని అంతేతప్ప  మీడియాకు లీకులిచ్చి రాజకీయ నాయకుల మంచి పేరు చెడగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు తిప్పి కొడతారని మోడీకి హితవు పలికారు.