బీజేపీ గెలుపు.. గాలివాటమే..రాష్ట్రంలో ఆ పార్టీ ప్రత్యామ్నాయం కాలేదు: కేటీఆర్

బీజేపీ గెలుపు.. గాలివాటమే..రాష్ట్రంలో ఆ పార్టీ ప్రత్యామ్నాయం కాలేదు: కేటీఆర్
  •     కాంగ్రెస్ అసమర్థ పాలనతో ప్రజలు మా వైపు నిలబడుతున్నరు
  •     పంచాయతీ ఎన్నికల్లో పార్టీ వైపు నిలబడ్డరు
  •     మున్సిపల్ ఎన్నికల్లోనూ నిలబడతరని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు బీజేపీ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్నారు. బీజేపీ బలం గాలివాటమేనని తేల్చి చెప్పారు. 24 నెలల కాంగ్రెస్ అసమర్థ పాలనకు పదేండ్లలో జరిగిన అభివృద్ధికి మధ్య ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. ప్రజలు బీఆర్​ఎస్​వైపు నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 

తన నివాసంలో హరీశ్ రావుతో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్​, మెదక్ జిల్లా నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. అంతకుముందు తెలంగాణ భవన్​లో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు బీఆర్​ఎస్​లో చేరిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. 

కాంగ్రెస్ అసమర్థ పాలనను చూసిన ప్రజలు.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్​వైపే నిలబడ్డారన్నారు. కాగా, రెండేండ్ల కింద పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం గాలివాటమే అని తెలిపారు. నాడు దేశంలోని రాజకీయ పరిస్థితులు కేవలం 2 పార్టీల మధ్యే అన్నట్టుగా మారడం, ఒక భిన్నమైన పరిస్థితి ఏర్పడడంతో ఆ పార్టీ గెలిచిందే తప్ప.. గతంలోగానీ, భవిష్యత్​లోగానీ బీజేపీకి క్షేత్రస్థాయి బలం లేదన్నారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ సీనియర్​ నేతలంతా ఓడిపోయారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​కు బీజేపీ ప్రత్యామ్నాయం కాబోదు.

రెండేండ్లుగా కాంగ్రెస్ అరాచకాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడింది. దీనిపై ప్రజల తరఫున కొట్లాడుతున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్. కృష్ణా జలాలు సహా అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఆ రెండు పార్టీలకు భవిష్యత్​లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు’’అని అన్నారు. 

రేవంత్ నిజాయితీ కలిగిన మోసగాడు

సీఎం రేవంత్​ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాత రోజులు తెస్తానని ఎన్నికలప్పుడు చెప్పారని, మోసం చేసేవారికే ప్రజలు అధికారం ఇస్తారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడు సరిగ్గా అదేరీతిలో రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని ఫైర్​ అయ్యారు. పింఛన్లు డబుల్, రైతుబంధు, దళిత బంధు, 2 లక్షల ఉద్యోగాలు, పీఆర్సీ సహా ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయకుండా మోసాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

‘‘నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. కేవలం పేపర్​లలో హెడ్​లైన్ కోసమే జాబ్ క్యాలెండర్​ ప్రకటించారు. 

బీఆర్ఎస్​ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలకే.. అపాయింట్​మెంట్ లెటర్లు ఇచ్చి అవి తామిచ్చినట్టు చెప్పుకుంటున్నరు. ఆ అబద్ధాలు ఎక్కువ రోజులు నడవవు’’అని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే.. రేవంత్ రెడ్డి తనకు తెలిసిన భాషలో మాట్లాడుతున్నారన్నారు. రేవంత్​కు తెలుగు, హిందీ, ఇంగ్లీష్​ వంటి భాషలేవీ రావని, ఆయనకు వచ్చిన ఏకైక భాష బూతులేనని ఎద్దేవా చేశారు.