- పదేండ్లు రాష్ట్రానికి నేనే సీఎం..
- మీడియాతో చిట్ చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: డీసీసీల మీటింగ్ లో తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడినవి ఎడిట్ చేసి ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన కాసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు.
హిందూ సమాజంలాంటిదే కాంగ్రెస్ అని డీసీసీ అధ్యక్షులకు చెప్పానని.. పార్టీ నేతగా ఎలా పనిచేయాలనేది వివరించే క్రమంలో ఉదహరించానని తెలిపారు. ‘‘డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పార్టీలో భిన్న రకాల మనస్తత్వాలపై చెప్పే ప్రయత్నం చేశాను. అధ్యక్షులు వయసులో చిన్నవారైనా.. పెద్ద బాధ్యతలో ఉన్నారని గుర్తు చేశా. జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ కోల్పోవడంతో బీజేపీ దీన్ని వివాదం చేస్తున్నది.
బీజేపీ నేతల రాద్ధాంతంతో ఒరిగేదేమీ లేదు. ఉత్తర భారతాన నన్ను పాపులర్ చేస్తున్నందుకు సంతోషిస్తున్నా’’ అని కౌంటర్ ఇచ్చారు. మరోవైపు కర్నాటకలో 2.5 ( చెరో రెండున్నరేండ్ల సీఎం) అంశం తెరపైకి వచ్చిందని, తెలంగాణలో ఎలా ఉండబోతున్నదని జాతీయ మీడియా ఆయనను ప్రశ్నించింది. ఇందుకు సీఎం బదులిస్తూ.. రెండు టర్మ్‌లు తానే సీఎంగా, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు.
