హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్‌ను ఏపీ నుంచి తెలంగాణకు కేటాయించాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ గత ఏప్రిల్‌లో ఇచ్చిన తీర్పు అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రోనాల్డ్ రాస్‌ను, కేటాయింపులపై కమిటీలు చేసిన సిఫార్సులను కోర్టుకు సమర్పించాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది.
రోనాల్డ్ రాస్‌ను తెలంగాణకు కేటాయించాలంటూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ పి.నరసింహశర్మ, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇస్తూ, పూర్తి వివరాలతో 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రోనాల్డ్ రాస్‌ను ఆదేశించింది.
