ఉజ్జయిని: ప్లాట్‌ఫామ్‌పై పడుకున్న దివ్యాంగుడి పట్ల రైల్వే పోలీస్ కానిస్టేబుల్ దారుణంగా ప్రవర్తించాడు. దివ్యాంగుడని కూడా జాలి లేకుండా కాళ్లతో తన్నుతూ, చేతులతో పిడిగుద్దులు కురిపించాడు. మంగళవారం రోజు దేశమంతా దివ్యాంగుల దినోత్సవాన్ని జరుపుకుంటుంటే ఉజ్జయిని జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
యూనిఫాం కూడా లేకుండా సివిల్ డ్రెస్‌లో ప్లాట్ ఫాంపైకి వచ్చిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మాన్ సింగ్.. ప్లాట్ ఫాంపై పడుకున్నాడని ఆగ్రహంతో దివ్యాంగుడిపై విరుచుకుపడ్డాడు. దీంతో దెబ్బలకు తాళలేక బాధితుడు కన్నీళ్లతో తన లగేజీ బ్యాగును భుజాన వేసుకుని కుంటుకుంటూ వెళ్లాడు. ఈ ఘటన మొత్తాన్నీ అక్కడే ఉన్న ఓ ప్యాసింజర్ తన మొబైల్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా నాగ్దా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారి రైల్వే ఉన్నతాధికారులకు చేరింది. దీంతో కానిస్టేబుల్ మాన్‌సింగ్‌ను ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్ చేశారు. కానిస్టేబుల్ ప్రవర్తన రైల్వే పోలీసుల గౌరవం తగ్గించేలా ఉందని సస్పెన్షన్ ఆర్డర్‌లో పేర్కొన్నారు. అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్ విడిచి వెళ్లొద్దని ఆదేశిస్తూ, మాన్‌సింగ్‌ను ఇండోర్ పోలీస్‌లైన్స్‌కు అటాచ్
చేశారు. అయితే, బాధితుడు మద్యం మత్తులో ఉన్నాడని, ఇష్టారీతిన తిడుతుండటం వల్లే అక్కడినుంచి పంపించేశానని మాన్‌సింగ్ చెప్తున్నాడు.
