- నెలాఖరుకల్లా పనులు ప్రారంభించాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయం
- తొలుత 517.5 మీటర్ల లెవెల్‌కు డ్యామ్‌ను ఖాళీ చేయాలి
- రెండో దశలో 517.5 నుంచి 510 మీటర్లకు నీటిని తగ్గించి రిపేర్లు
హైదరాబాద్, వెలుగు: ప్రజల తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సింగూరు డ్యామ్కు రిపేర్లు చేయించాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. రెండు విడతల్లో మరమ్మతులు చేసేలా ప్రణాళికలను రూపొందించింది. అందుకు అనుగుణంగా డ్యామ్‌ను ఖాళీ చేసే చర్యలను చేపట్టింది. ఈ నెలాఖరు నాటికి డ్యామ్కు రిపేర్లను ప్రారంభించాలని నిర్ణయించింది. డ్యామ్ మరమ్మతులపై ఈఎన్సీ అంజద్ హుస్సేన్ నేతృత్వంలో కామారెడ్డి సీఈ శ్రీనివాస్, ఓ అండ్ ఎం ఈఎన్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులతో బుధవారం జలసౌధలో సమావేశం నిర్వహించారు. వాస్తవానికి ఇటీవల ఈఎన్సీతో పాటు స్టేట్ డ్యామ్ సేఫ్టీ కమిటీ చైర్మన్ డ్యామ్‌ను పరిశీలించి వచ్చారు.
ఈ క్రమంలోనే డ్యామ్కు రిపేర్లు అవసరమని తేల్చారు. తాజాగా నిర్వహించిన మీటింగ్‌లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, అనంతరం రిపేర్లపై ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్ఏ) సిఫార్సులకు అనుగుణంగా డ్యామ్కు రెండు విడతల్లో రిపేర్లు చేయాలని డ్యామ్ సేఫ్టీ కమిటీ నిర్ణయించింది. సింగూర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29 టీఎంసీలు.. రిజర్వాయర్ లెవెల్ 517.8 మీటర్లు కాగా.. ప్రస్తుతం మిషన్ భగీరథ పథకం కోసం రిజర్వాయర్ కనీస స్థాయిని 522 మీటర్ల కంటే ఎక్కువగా నిర్వహిస్తున్నారు.
దీంతో ఆనకట్టకు ఇరువైపులా7 కిలోమీటర్ల మేరకు విస్తరించిన మట్టి, రాళ్లు, నీటి అలల తాకిడికి దాదాపు 900 మీటర్ల మేర దెబ్బతిన్నదని గుర్తించారు. ఈ క్రమంలోనే 517.5 ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద డ్యామ్‌లో 8 టీఎంసీలకుపైగా జలాలు అందుబాటులో ఉండే అవకాశముందని, కొద్దిమేర లోటు ఏర్పడినా స్థానిక నీటివనరులతో ఆ లోటును భర్తీ చేయవచ్చని కమిటీ అభిప్రాయపడింది. అందుకు తగ్గట్టుగా తొలివిడతలో 517.5 మీటర్ల లెవెల్‌కు నీటిని ఖాళీ చేసి రిపేర్లు చేయాలని ప్రతిపాదించింది. రెండో దశలో 517.5 నుంచి 510 క్రస్ట్ లెవల్ వరకు నీటిని తగ్గించి రిపేర్లు చేయాలని నిర్ణయానికి వచ్చింది.
ఖాళీ చేసేందుకు 20 రోజులు..
సింగూరు డ్యామ్ లో ప్రస్తుతం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 522 మీటర్ల మేర నీటి నిల్వ ఉన్నది. రిపేర్ల కోసం నీటిని ఖాళీ చేయాల్సి ఉండడంతో రోజుకు ఒక అడుగు చొప్పున ఖాళీ చేయాలని కమిటీ తెలిపింది. దిగువన ఉన్న ఘనపూర్ ఆనకట్ట, నిజాంసాగర్ నిండుగా ఉన్నాయి. కాబట్టి నీటిని ఖాళీ చేసేందుకు దాదాపు 20 రోజులకుపైనే పడుతుందని కమిటీ అంచనా వేసింది. డ్యామ్‌ను ఖాళీ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి అనుమతి పొందాకే ముందుకు వెళ్లాలని స్పష్టం చేసింది.
కాగా, సింగూరు ప్రాజెక్టు ఆయకట్టుకు సంబంధించి కాలువల లైనింగ్‌కు ఇప్పటికే రూ.140 కోట్లు మంజూరయ్యాయి. ఈ సీజన్‌లో మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో సంబంధిత లైనింగ్ పనులను కూడా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులు సన్నద్ధమయ్యారు.
ఎన్‌డీఎస్ఏ ఆందోళన
డ్యామ్ సేఫ్టీ చట్టానికి అనుగుణంగా ఏటా వర్షాకాలానికి ముందు, తర్వాత ఇన్స్పెక్షన్ చేసి రిపోర్టులను ఎన్డీఎస్ఏకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఏడాది వర్షాకాలానికి ముందు సింగూరు డ్యామ్‌ను అధికారులు తనిఖీ చేసి రిపోర్టును పంపించారు. ఆ నివేదికను పరిశీలించిన ఎన్‌డీఎస్ఏ.. ఈ డ్యామ్ అత్యంత ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. డ్యామ్ ఎగువ వాలుపైనున్న రివెట్‌మెంట్‌తోపాటు, ఎఫ్‌ఆర్‌ఎల్ భాగానికి సమీపంలోని వివిధ ప్రదేశాల్లో మట్టి వాలు రివెట్‌మెంట్ దెబ్బతిని ఉందని వివరించింది.
పారాపెట్ గోడకు ఆనుకుని ఉన్న ఎర్త్ డ్యామ్ పైభాగంలో పగుళ్లు ఉన్నాయని, గోడ కూడా ఎగువ వైపు వంగి ఉన్నదని వెల్లడించింది. వీలైనంత త్వరగా డ్యామ్ భద్రతకు తగిన చర్యలను చేపట్టాలని ఎన్‌డీఎస్ఏ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే డ్యామ్ రిపేర్లకు ఇరిగేషన్ శాఖ కసరత్తును ముమ్మరం చేసింది.
