బాలుడిపై కుక్కల దాడి.. సీఎం రేవంత్ ఆరా

బాలుడిపై కుక్కల దాడి.. సీఎం రేవంత్ ఆరా
  • ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు ఆదేశం
  • మెరుగైన ట్రీట్​మెంట్​ అందేలా  చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌‌‌‌కు ఆర్డర్స్​
  • ప్రభుత్వపరంగా ఆదుకోవాలని సూచన

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌లోని హయత్ నగర్‌‌‌‌లో మూగబాలుడు ప్రేమ్ చంద్‌‌పై వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సీఎంవో, జీహెచ్ఎంసీ అధికారులతో బుధవారం ఆయన మాట్లాడారు. ఖర్చుకు వెనుకాడకుండా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు.

 బాలుడి కుటుంబ సభ్యులను కలిసి, వారిని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. సీఎం ఆదేశాలతో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి వకీల్‌‌తో బల్దియా కమిషనర్ ఆర్వీ కర్ణన్ సమీక్షించారు. ప్రస్తుతం నిలోఫర్ హాస్పిటల్‌‌లో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్డర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్లకు సీఎం బాధ్యతలను అప్పగించారు.

 జనావాస ప్రాంతాల్లో వీధి కుక్కలు లేకుండా ఇప్పటికే చేపట్టిన డ్రైవ్‌‌ను ముమ్మరం చేయాలన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కూడా ఈ ఘటనపై ఆరా తీసి బాలుడికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. నిలోఫర్‌‌‌‌లో చికిత్స పొందుతున్న బాలుడిని జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నర్సింహా రెడ్డి పరామర్శించారు. సీఎం ఢిల్లీలో ఉన్నా ఘటనపై స్పందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులుకు సాయం చేసేందుకు శానిటేషన్ విభాగం నుంచి ఇద్దరు మహిళా సిబ్బందిని నియమించారు.