- ఏ ఒక్క ప్రాజెక్టుకు ఉద్యమకారుల పేరు పెట్టలేదు: జాగృతి అధ్యక్షురాలు కవిత
ఎల్బీనగర్/హైదరాబాద్, వెలుగు: ఉద్యమకారులను అప్పుడు బీఆర్ఎస్ మోసం చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఎల్బీనగర్ అంటేనే ఉద్యమాల పురిటి గడ్డ అని.. కేసీఆర్ దీక్షకు పూనుకున్న రోజే శ్రీకాంతాచారి తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నాడని తెలిపారు. శ్రీకాంతాచారి 16 వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ లోని ఆయన విగ్రహానికి కవిత పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి ఆశయాల కోసం మనమందరం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఎంతోమంది అమరుల ఫలితమే తెలంగాణ రాష్ట్రం అని.. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొంతమందికి మాత్రమే న్యాయం చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది ఉద్యమకారులకు అన్యాయమే జరిగిందన్నారు. ఆనాటి ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టుకు కూడా ఉద్యమకారుల పేరు పెట్టలేదని.. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమరులను విస్మరిస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు వెంటనే పరిష్కరించాలని.. లేదంటే ప్రభుత్వ భూములను కైవసం చేసుకుని జాగృతి జెండాలు పాతుతామని కవిత హెచ్చరించారు. తెలంగాణ వాళ్ల దిష్టికండ్లతో కోనసీమ పాడయిందని ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ అనడం హాస్యాస్పదమని కవిత అన్నారు.
కోనసీమ చాలా బాగుందని.. సీమలాగానే తెలంగాణ కూడా ఉండాలని కోరుకున్నామే తప్ప.. ఏనాడూ ఆంధ్రకు వ్యతిరేకంగా మాట్లాడలేదని పేర్కొన్నారు. అప్పట్లో పవన్ కల్యాణ్ సినిమా హీరో కాబట్టి ఏమన్నా నడిచిందని.. కానీ, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దూగుంట్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణాల్లో మీటింగులు పెట్టి ఓట్లడుగుతున్నరు
పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ లేకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్‌గా తీసుకొని అక్కడ మీటింగ్‌లు పెట్టి, ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. సీఎం టూర్ల మీద ఆంక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదినిని కలిసి ఆమె ఫిర్యాదు చేశారు. జిల్లాల పర్యటనల్లో సీఎం వ్యాఖ్యలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించేలా ఉన్నాయన్నారు.
