- ప్రతి శాఖలో ఒక నోడల్ ఆఫీసర్.. ప్రతినెలా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండేలా యాక్షన్ ప్లాన్
- వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విజన్ డాక్యుమెంట్ టేబుల్!
హైదరాబాద్, వెలుగు: ‘తెలంగాణ రైజింగ్ – 2047’ విజన్ డాక్యుమెంట్‌ను వచ్చే నెల నుంచే అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ పాలసీకి సంబంధించిన ముసాయిదాపై ఇప్పటికే ఉన్నతస్థాయిలో కీలక చర్చలు పూర్తయ్యాయి. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో స్పష్టమైన ఫలితాలు కనిపించేలా జనవరి నుంచి పక్కా కార్యాచరణ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
డిసెంబర్ 8న పాలసీని ఆవిష్కరించనున్నారు. రానున్న ఇరవయ్యేండ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో ఈ ప్రణాళికను రూపొందిస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. దీనికి తుది మెరుగులు దిద్దుతున్న ఉనతాధికారులు.. సీఎం ఆదేశాల మేరకు అమలు తేదీని ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ప్రణాళికను అమలు చేసే క్రమంలో పాలనాపరమైన సమన్వయ లోపాలు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుడుతున్నది.
ఇందులో భాగంగా సెక్రటేరియెట్‌లో ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ప్రత్యేకంగా ఒక ‘నోడల్ ఆఫీసర్’ను నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. విజన్ డాక్యుమెంట్‌లో నిర్దేశించుకున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలకు తగ్గట్టు ఆయా శాఖలు పని చేస్తున్నాయా? లేదా? అనేది ఎప్పటికప్పుడు పర్యవేక్షించడమే వీరి ప్రధాన బాధ్యత. ప్రతినెలా ఆయా శాఖల పనితీరుపై సమగ్రమైన ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ సిద్ధం చేసి, నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయాని(సీఎంవో)కి నివేదించేలా యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. దీనివల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.
రేపటి వరకు పాలసీకి తుదిరూపు
విజన్ డాక్యుమెంట్‌కు చట్టబద్ధత కల్పించి, రాష్ట్ర ప్రజల్లో దీనిపై విస్తృతమైన చర్చ జరిగేలా చూడాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ పాలసీ డాక్యుమెంట్‌ను సభలో ప్రవేశపెట్టాలని (టేబుల్ చేయాలని) సూత్రప్రాయంగా నిర్ణయించింది. చట్టసభల వేదికగా సభ్యుల అభిప్రాయాలను స్వీకరించడం, ప్రతిపక్షాల సూచనలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా పాలసీకి మరింత బలం చేకూరుతుందని అంచనా వేస్తున్నది.
