చెన్నై: ప్రముఖ సినీ నిర్మాత, ఏవీఎం ప్రొడక్షన్స్ యజమాని ఏవీఎం శరవణన్ కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా వచ్చిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. గురువారం ఉదయం ఆయన కాలం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన ఎనలేని సేవ చేశారు. 300 పై చిలుకు సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు.
తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఆయన సినిమాలను నిర్మించారు. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటీ అడక్కు సినిమాలు ఆయన నిర్మాణంలో తెరకెక్కినవే కావడం విశేషం. AVM ప్రొడక్షన్స్కు భారతీయ సినీ పరిశ్రమలో ఎంత పేరుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1946లో ఐకానిక్ AVM స్టూడియోస్‌ను స్థాపించిన AV మెయ్యప్పన్ (AV మెయ్యప్ప చెట్టియార్) కొడుకే ఈ శరవణన్. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, AVM ప్రొడక్షన్స్ కీర్తిప్రతిష్టలను శరవణన్ ఉన్నత శిఖరాలకు చేర్చారు.
శరవణన్ నిర్మించిన సినిమాల్లో.. నానుమ్ రు పెన్, సంసారం అతు ఎక్తిల్ సినిమాలు ఆల్ టైం క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. రజనీకాంత్ నటించిన శివాజీ, విజయ్ వెట్టైకరన్, సూర్య అయాన్ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాయి. AVM స్టూడియోస్ తమిళ పరిశ్రమకు స్టార్ హీరోలను అందించింది. శరవణన్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఏవీఎం ప్రొడక్షన్స్ బాధ్యతలను ఆయన కొడుకు MS కుగన్ చూసుకుంటున్నారు. ఎం. శరవణన్ మరణం ఒక శకానికి ముగింపు పలికింది. ఒక గొప్ప సినీ వారసత్వాన్ని నిలబెట్టిన దిగ్గజాన్ని కోల్పోవడంతో సినీ ప్రపంచం, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
