ఐబొమ్మ రవిపై మళ్లీ కస్టడీ పిటిషన్

ఐబొమ్మ రవిపై మళ్లీ కస్టడీ పిటిషన్
  • మరో నాలుగు కేసుల్లో దాఖలు చేసిన సైబర్ పోలీసులు  
  • కౌంటర్ దాఖలు చేయాలని రవి అడ్వకేట్​కు కోర్టు ఆదేశం

బషీర్​బాగ్, వెలుగు: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని మరోసారి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. నాంపల్లి కోర్టు అనుమతితో గతంలో ఓ కేసులో మొదట ఐదు, మరోసారి మూడు రోజులపాటు విచారణ చేసిన విషయం తెలిసిందే.  ఇమ్మడి రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం ఐదు కేసులు నమోదు చేయగా, ఇప్పుడు మరో నాలుగు కేసుల్లో కస్టడీ కోరుతూ పోలీసులు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. ఒక్కో కేసులో 7 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ ను నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. అయితే, కస్టడీ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఇమ్మడి రవి న్యాయవాదిని కోర్టు ఆదేశించింది. కస్టడీ విచారణ పూర్తయ్యాకే బెయిల్ పై వాదనలుఇమ్మడి రవి న్యాయవాది మొదట నమోదు అయిన కేసుపై గతంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

 ఇప్పుడు మరో నాలుగు కేసుల అంశంలో కస్టడీ కోరుతూ పోలీసులు ఫిటిషన్ దాఖలు చేయగా.. కస్టడీ అనంతరం బెయిల్ పిటిషన్  విచారణకు వచ్చే అవకాశం ఉంది. నకిలీ స్ట్రీమింగ్ వెబ్‌‌‌‌సైట్లు, పైరసీ కార్యకలాపాలకు సంబంధించిన కేసుల్లో నిందితుడిగా ఉన్న రవిని గత కస్టడీ విచారణలో నెట్ వర్క్ , ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ఆరా తీశారు. ఐపీలను మాస్క్ చేసి నడుపుతున్న అనధికారిక వెబ్‌‌‌‌సైట్లు, పోర్న్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లు, పైరసీ వీడియోలను అప్‌‌‌‌లోడ్ చేసే ముఠాల కార్యకలాపాలపై రవిని ప్రశ్నించారు. 

పలుసార్లు ఐపీ అడ్రెస్‌‌‌‌ను దాచడానికి ఉపయోగించిన టెక్నిక్‌‌‌‌లు, విదేశీ సర్వర్ల వాడకం, యాడ్ బుల్ యాప్ నిర్వహణకు గల కారణాలు వంటి అంశాలపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టినట్లు సమాచారం.  ఇప్పుడు మిగిలిన నాలుగు కేసులలో కస్టడీ విచారణ చేపడితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు.