వెంటిలేటర్పై టీఆర్ఎస్ సర్కార్ 

వెంటిలేటర్పై టీఆర్ఎస్ సర్కార్ 
  • వెంటిలేటర్ పై టీఆర్ఎస్ సర్కార్ 
  • మోడీ 12 మంది దళిత ఎంపీలను కేంద్ర మంత్రులుగా చేసిండు
  • మరి దళితుడిని సీఎం చేసే దమ్ము కేసీఆర్కు ఉందా?
  • ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో రాజకీయం చేస్తుండు..
  • మునుగోడు ఉపఎన్నిక కోసమే కొత్త పాట పాడుతున్నారని ఫైర్
  • పెద్దఅంబర్ పేట వద్ద నాలుగో విడత పాదయాత్ర ముగింపు సభ 
  • ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ఖేల్ ఇక ఖతమేనని, ఆయన దుకాణం బంద్ అవుతుందని, మునుగోడు ఉప ఎన్ని కలో బీజేపీ పక్కా గెలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ వెంటిలేటర్ పై ఉందన్నారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా గురువారం ఇబ్రహీంపట్నం మండలం పెద్ద అంబర్ పేట వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి హాజరయ్యారు. సభ వేదికపైకి సాధ్వి నిరంజన్ జ్యోతి రాగానే సంజయ్ ఆమె కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. "ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు రావడం లేదంటున్న టీఆర్ఎస్, ఎంఐఎంకు సవాల్ చేస్తున్నా.. బలప్రదర్శనకు మేం సిద్ధం... టైమ్, ప్లేస్ చెప్పండి.. దమ్ముంటే టీఆర్ఎస్ తన మిత్రపక్షమైన ఎంఐఎంతో కలిసి రావాలి. మా బలమేంటో నిరూపిస్తాం.." అని సవాల్ విసిరారు. గడీల పాలనలో తెలంగాణ తల్లి బందీగా మారిందన్నారు. గరీబోళ్ల రాజ్యం కావాలో.. గడీలరాజ్యం కావాలో. రామరాజ్యం కావాలో.. రావణ రాజ్యం కావాలో తెలంగాణ ప్రజలే తేల్చుకోవాలని కోరారు.

అక్టోబర్ 15 నుంచి ఐదో విడత

పాదయాత్రను అడుగడుగునా కేసీఆర్ అడ్డుకుంటున్నారని, బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేయిస్తున్నారని, కేసులు పెట్టిస్తున్నారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. సంక్షేమ పథకాలను తీసేస్తారంటూ కొందరు టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను బీజేపీ ఆపదు. అవి టీఆర్ఎస్ వైనా.. కాంగ్రెస్ వైనా సరే.. పేదలకు మరింత మంచి జరిగేలా సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం" అని వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవడమే లక్ష్యంగా పనిచేద్దామని, ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్తును నిర్ణయించేదని చెప్పారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర అక్టోబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్‌‌‌‌కు తెలుసని, అందుకే ఎస్సీ, ఎస్టీలను మరోసారి మోసం చేసేందుకు అనేక హామీలు గుప్పిస్తున్నాడని మండిపడ్డారు. మునుగోడు బైపోల్.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక కానుందన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తనను తీవ్రంగా కదలించాయన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఇబ్రహీంపట్నం పేరును వీరపట్నంగా మారుస్తామని హామీ ఇచ్చారు.

దళితుడిని సీఎం చేసే దమ్ముందా?

‘‘సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని బీజేపీ ఎప్పటి నుంచో పోరాడుతున్నది. బీజేపీ పోరాటంతోనే టీఆర్ఎస్ దిగివచ్చింది. కానీ చరిత్రను వక్రీకరించేలా జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరిపింది” అని బండి సంజయ్ మండిపడ్డారు. పాతబస్తీలో జాతీయ జెండాను పట్టుకొని తిరిగేలా చేసిన ఘనత బీజేపీదేనన్నారు. ‘‘అంబేద్కర్ విగ్రహాన్ని పార్లమెంట్‌‌లో పెట్టిన పార్టీ బీజేపీనే. 12 మందిని దళిత ఎంపీలను కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత మోడీ సర్కార్‌‌‌‌దే. మరి కొత్త సచివాలయంలో దళితుడిని సీఎం చేసి, కొత్త కుర్చీలో కూర్చోబెట్టే దమ్ముందా?” అని ప్రశ్నించారు. దళితులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్ అనిఆరోపించారు. ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ రాజకీయం చేస్తున్నాడని, మునుగోడు ఉప ఎన్నిక కోసమే రిజర్వేషన్ల పాట పాడుతున్నాడని విమర్శించారు. చేనేత కార్మికులను, గౌడ కులస్తులను, యాదవులు.. ఇలా అన్ని కులాలను నిర్వీర్యం చేసిన చరిత్ర టీఆర్ఎస్ దేనని ధ్వజమెత్తారు. మజ్లిస్ అధినేత ఒవైసీకి ఉగ్రవాదులు మాత్రమే కనపడతారన్నారు.

టీఆర్ఎస్‌‌లో ప్రకంపనలు: లక్ష్మణ్

బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. సంజయ్ పాదయాత్ర.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తున్నదన్నారు. 

కేసీఆర్‌‌‌‌కు నిద్రపడ్తలే: రాజగోపాల్ రెడ్డి

జనం లేక కేసీఆర్ సభలు వెలవెలబోతున్నాయని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఉప ఎన్నిక అంటేనే కేసీఆర్ భయపడుతున్నాడని, ఆయనకు నిద్ర కూడా పట్టడం లేదన్నారు. ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈ సభకు తరలి వచ్చిన అందరికీ స్వాగతమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ నిర్మించిన 60 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. 2023 జనవరి ఒకటి కల్లా లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయకపోతే.. తాము అధికారంలోకి రాగానే పంపిణీ చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలో ధరణి పేరుతో అధికారులు రూ.వేల కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, సీనియర్ నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

రాజాసింగ్‌‌ను రిలీజ్​ చేయాలంటూ నినాదాలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌‌ను విడుదల చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నినాదాలు చేశారు. దీంతో సభకు కొద్దిసేపు ఆటంకం కలిగింది. చివరకు బండి సంజయ్ జోక్యం చేసుకొని.. ‘‘జైలుకు పంపినోళ్లను వదిలిపెట్టబోం. మీరు భయపడవద్దు” అని కార్యకర్తలకు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.

అవినీతిపరుల భరతం పడ్తం: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి

ఉత్తరప్రదేశ్​లో ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ల ఇండ్లను సీఎం యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్లతో కూలగొట్టినట్లే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అదే పని చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సంచలన కామెంట్స్ చేశారు. కృష్ణుడి తరహాలో శంఖం పూరించి యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌‌లో మతమార్పిడులు జరుగుతున్నాయని, ఒవైసీ లాంటి విష పాములు దేశ సంస్కృతిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే.. హైదరాబాద్‌‌లో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయన్నారు. ‘‘బీజేపీ ముస్లింలను వ్యతిరేకించదు. మా పార్టీ ముస్లిం వ్యతిరేకే అయితే.. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసేదా? గిరిజనులకు బీజేపీ వ్యతిరేకే అయితే... రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును చేసేదా?” అని ప్రశ్నించారు.