అధికారంలోకి రాగానే 370 ఆర్టికల్ రద్దు: అమిత్ షా

అధికారంలోకి రాగానే 370 ఆర్టికల్ రద్దు: అమిత్ షా

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే జమ్మూకాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ కల్పించే రాజ్యాంగంలోని370 ఆర్టికల్ ను రద్దు చేస్తామని బీజేపీ చీఫ్ అమిత్ షా ప్రకటించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఎన్ఆర్ సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్)ను అమల్లో కితీసుకువస్తామని చెప్పారు. గురువారం పశ్చిమ బెంగాల్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా మాట్లాడారు. ఎన్ ఆర్సీ విషయంలో తృణమూల్ చీఫ్ మమతా బెనర్జీ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తృణమూల్ మిత్రపక్ష నేత ఒమర్అబ్దుల్లాలాగే ఆమె కూడా దేశానికి మరో ప్రధాని కావాలని కోరుకుంటున్నారేమో ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

మమతవి ఓటుబ్యాంకు రాజకీయాలు
మైనార్టీల ఓట్ల కోసం మమతా బెనర్జీ రాజకీయాలు చేస్తున్నారని, అందుకే సర్జికల్ స్ట్రైక్స్ ను ప్రశ్నిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్ పై పాకిస్తాన్ తర్వాత విచారం వ్యక్తం చేసింది మమతా బెనర్జీ కార్యాలయాలేనని, ఇది దేశానికి అవమానమని విమర్శించారు. జాతీయ పౌరసత్వ రిజిస్టర్ తుదిజాబితాలో 40 లక్షల మంది పేర్లు లేకపోవటంతోనే వివాదాన్ని సృష్టించారని, అస్సాంలో ఇండియన్స్ ను కూడా శరణార్థులుగా మార్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తాము మాత్రం చొరబాటుదారులను తొలగించేందుకు ప్రయత్నించామన్నారు. దేశవ్యాప్తంగా ఎన్ ఆర్సీ అమలు చేస్తామని, వలస వచ్చిన హిందువులు, బుద్ధులు, సిక్కులు దేశ పౌరసత్వాన్ని పొందుతారని చెప్పారు.

తృణమూల్ తో ఎవరూ పొత్తు పెట్టుకోరు
మమత ప్రతిపాదించిన మహాకూటమిని తన మిత్రపక్షాలైన కాంగ్రెస్, సీపీఎంలు కూడా విమర్శిస్తున్నాయన్నారు. సరైన పాలసీ లేని కూటమికి, ఆమెతో పొత్తుకు ఎవరూ సిద్ధంగా లేరని విమర్శించారు. 60 ఏళ్లుదాటిన తేయాకు తోట కూలీలకు రూ.3 వేల పెన్షన్ఇస్తామని బీజేపీ ప్రకటించిందన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి బెంగాల్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు.