పోలింగ్ బూత్ కమిటీలపై బీజేపీ ఫోకస్ 

పోలింగ్ బూత్ కమిటీలపై బీజేపీ ఫోకస్ 

పోలింగ్ బూత్ కమిటీలపై రేపు (ఈనెల23న) బీజేపీ మీటింగ్ నిర్వహించనుంది. బూత్ కమిటీల నియామకంపై బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలతో..రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, పలువురు బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు కూడా పాల్గొననున్నారు. రాష్ట్ర కార్యాలయంలో రేపు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం నిర్వహించనున్నారు. 

రాష్ట్రంలో మొత్తం 35 వేలకుపైగా పోలింగ్ బూత్ లను గుర్తించారు. ఒక్కో పోలింగ్ బూత్ లో 22 మంది సభ్యులతో కమిటీ ఉండాలనేది బీజేపీ నిబంధనగా ఉంది. 21 మంది బూత్ కమిటీ సభ్యులుగా కాగా ఒకరు మాత్రం సోషల్ మీడియా సభ్యుడై ఉండాలి. అంటే మొత్తం 22 మందితో పోలింగ్ బూత్ కమిటీ ఉండాలని రూల్. కానీ.. చాలా పోలింగ్ బూత్ కమిటీల్లో 22 మంది సభ్యులు లేరు.  8 నుంచి 15 మందే వరకే ఉన్నారు. మరికొన్ని కమిటీల్లో పూర్తిస్థాయిలో సభ్యులు ఉన్నారు. తక్కువ సభ్యులు ఉన్న పోలింగ్ బూత్ లను 22 మందితో  పూర్తిస్థాయిలో నియామకం చేయడమే భూత్ స్వశక్తికరణ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ సమావేశంలో సునీల్ బన్సల్ మొత్తం బూత్ కమిటీలు, సభ్యుల సంఖ్య లెక్క తేల్చనున్నారు. ఏ బూత్ లో ఎంత మంది సభ్యులు ఉన్నారు..? పూర్తిస్థాయి కమిటీలు వేసిన బూత్ లు ఎన్ని..? ఇప్పటి వరకు బూత్ కమిటీల నియామకం ఎందుకు పూర్తి చేయలేదు..? బూత్ కమిటీల నియామకం ఏ విధంగా పూర్తి చేసుకోవాలనే పలు అంశాలపై పార్టీ నాయకులకు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్ దిశానిర్దేశం చేయనున్నారు.