నేడు రాజకీయ తీర్మానం చేయనున్న బీజేపీ

నేడు రాజకీయ తీర్మానం చేయనున్న బీజేపీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2023లో అధికారమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం రాజకీయ తీర్మానం చేయనుంది. ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలు చేసేందుకు యాక్షన్ ప్లాన్ ను రెడీ చేస్తున్నది. తెలంగాణకు.. కేంద్రం ఏ పథకం ద్వారా ఎన్ని నిధులు ఇచ్చిందనే విషయాలపై ప్రజల్లో చర్చ పెట్టాలనే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, అది బీజేపీతోనే సాధ్యమని నమ్ముతున్నారని, ఇందుకు ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలే నిదర్శనమని పార్టీ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం సంవత్సరం మాత్రమే సమయం ఉండడంతో రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలుపై ఎక్కడికక్కడ  ఎండగట్టాలని బీజేపీ తీర్మానించనుంది.  హైదరాబాద్ శివారు శామీర్ పేట్ లోని ఓ రిసార్ట్ లో ఆదివారం ప్రారంభమైన మూడు రోజుల బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు మంగళవారంతో ముగియనున్నాయి. ముగింపు రోజున మధ్యాహ్నం లంచ్ తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరుగనుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి షన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, పార్టీ సీనియర్ నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, జితేందర్ రెడ్డి, మురళీధర్ రావు, ఇతర లీడర్స్  పాల్గొననున్నారు. ఇందులో పలు తీర్మానాలు చేయనున్నారు.  

బూత్​ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి

జాతీయ, రాష్ట్ర స్థాయిలోని వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై బీజేపీ నేతలకు శిక్షణ కొనసాగుతున్నది. మొదటి రోజైన ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉపన్యాసాలతో ప్రారంభమైన బీజేపీ శిక్షణ తరగతులు సోమవారం బూత్​స్థాయిలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, దేశ రక్షణ, వ్యవసాయం, ఇతర విషయాలపై చర్చించారు. బీజేపీ సంస్థాగత జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, పార్టీ నేషనల్ లీడర్ విజయ్ చైతువాలా, ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రముఖ్ లింగం శ్రీధర్ తో పాటు మరి కొందరు పలు అంశాలపై రాష్ట్ర నేతలకు శిక్షణ ఇచ్చారు. మంగళవారం మధ్యహ్నం వరకు మరి కొన్ని అంశాలపై క్లాస్ లు నడువనున్నాయి. అనంతరం లంచ్ బ్రేక్ తర్వాత.. ఈ మూడు రోజుల పాటు పలు అంశాలపై శిక్షణ పొంది, వివిధ విషయాలపై చర్చకు వచ్చిన వాటిపై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మరోసారి చర్చించి తీర్మానం చేయనున్నారు. ఇందులో రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలన్నింటిని కలిపి ఒకే తీర్మానం కింద ఆమోదించే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.