టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం

టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం
  • ఎమ్మెల్యే స్టిక్కర్‌‌ ఉన్న​కారులో డబ్బులున్నాయని అడ్డుకున్న బీజేపీ
  • తనిఖీ చేయాలని కార్యకర్తల నిరసన
  • కారులో సోదాలకు పోలీసుల తటపటాయింపు
  • రెండుసార్లు పోలీసుల లాఠీచార్జ్
  • చివరికి ఏమీ లేవని తేల్చిన ఖాకీలు

యాదాద్రి, చౌటుప్పల్, వెలుగు: ఎమ్మెల్యే స్టిక్కర్‌‌తో వచ్చిన కారులో డబ్బులు తరలిస్తున్నారని, తనిఖీ చేయాలని బీజేపీ కార్యకర్తలు బుధవారం రాత్రి చౌటుప్పల్‌లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్​ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కానీ తనిఖీ చేయడానికి తటపటాయించిన పోలీసులు.. ఆ కారును పోలీస్​స్టేషన్‌కు తరలించారు. రెండున్నర గంటల హైడ్రామా తర్వాత తనిఖీ చేసి కారులో ఏమీ లేదని తేల్చారు. అయితే రెండున్నర గంటల పాటు కారును పోలీసులు ఎందుకు తనిఖీ చేయలేదు? కారు డ్రైవర్​ఎందుకు పారిపోయాడు? అన్నది తెలియడం లేదు. పోలీసులు కావాలనే లేట్​చేసి తమను సైడ్​ట్రాక్​ పట్టించారని, ఈ సమయంలో టీఆర్ఎస్​కు జరగాల్సిన మేలు దగ్గరుండి జరిపించారని బీజేపీ కార్యకర్తలు అనుమానిస్తున్నారు. తాము ఆందోళన చేస్తున్న సమయంలో ఓ ఫార్చునర్ కారు వెళ్లిందని, అందులోనే టీఆర్ఎస్​కు సంబంధించిన నగదు తరలివెళ్లిందని ఆరోపిస్తున్నారు.

అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో..

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ టౌన్‌లోకి బుధవారం సాయంత్రం మంత్రి హరీశ్​రావు స్టిక్కర్‌‌తో ఉన్న కారు వచ్చింది. అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో ఓటర్లకు డబ్బు పంపిణీ చేయడానికి వచ్చిందని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో కారులో పెద్ద ఎత్తున డబ్బుందన్న అనుమానంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులకు సమాచారమిచ్చారు. అరగంట తర్వాత ఇద్దరు పోలీసులు మాత్రమే అక్కడికి వచ్చారు. అదే సమయంలో కారును వదిలి పారిపోయిన డ్రైవర్​కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలను తీసుకొని అక్కడికి వచ్చాడు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు నినాదాలు చేసుకున్నారు. వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులకు నెలకొన్నాయి. అప్పుడే మరికొందరు పోలీసులు అక్కడికి చేరుకోవడంతో కారును చెక్ చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు కారు డిక్కీని మాత్రం ఓపెన్ చేసి వెంటనే మూసేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు... పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించి పోలీసులు లాఠీచార్జ్​ చేశారు. తర్వాత పలువురు టీఆర్ఎస్ నాయకులను కారులో కూర్చోబెట్టుకొని పోలీసులు వెళ్తుండగా.. ఓ ఇంటిపైకి చేరుకున్న పలువురు బీజేపీ కార్యకర్తలు కారుపై పూలకుండీ విసిరేశారు. దీంతో పోలీసులు ఇంట్లో నుంచి బీజేపీ కార్యకర్తలను బయటకు తీసుకొచ్చి లాఠీలకు పని చెప్పారు. పోలీస్​స్టేషన్​కు చేరుకున్న తర్వాత బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలను బయటకు పంపించారు. తర్వాత మీడియా ప్రతినిధుల సమక్షంలో కారును పూర్తిగా తనిఖీ చేయగా అందులో ఏమీ దొరకలేదు. అయితే ఏమీ లేని కారును తనిఖీ చేయడానికి పోలీసులు ఎందుకు తటపటాయించారన్నది మాత్రం ప్రశార్థకంగా మారింది.