- హైకోర్టులో బీజేపీ రిట్ పిటిషన్
- 70 రోజుల్లో 25 వేల కొత్త అప్లికేషన్లు
- టీఆర్ఎస్ బోగస్ ఓట్లను నమోదు చేయిస్తోంది
- పాత లిస్ట్‌తో ఎన్నిక జరిపేలా ఈసీని ఆదేశించాలని విజ్ఞప్తి
- 13న పిటిషన్‌ను విచారిస్తామన్న సీజే బెంచ్
హైదరాబాద్, వెలుగు: పాత ఓటర్ లిస్ట్ ఆధారంగానే మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో బీజేపీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని టీఆర్ఎస్ భారీ ఎత్తున బోగస్ ఓట్లను నమోదు చేయిస్తోందని ఆరోపించింది. ఏడు నెలల్లో 1,500 లోపు మాత్రమే కొత్తగా ఓటుకు దరఖాస్తు చేసుకుంటే.. ఈ 70 రోజుల్లో ఏకంగా పాతిక వేల మంది ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణించాలని కోరింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్, వెలుగు: మునుగోడు బై ఎలక్షన్ ఫైనల్ ఓటరు లిస్ట్‌పై గందరగోళం నెలకొంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత వేల సంఖ్యలో ఓటరు నమోదు కోసం అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 4 వరకు దాదాపు 24 వేల అప్లికేషన్లు ఓటరు రిజిస్ర్టేషన్ కోసం అందాయి. ఒక్క నియోజకవర్గంలో ఓటు కోసం ఈ స్థాయిలో అప్లికేషన్లు రావడం ఇదే మొదటిసారి అని ఆఫీసర్లు చెప్తున్నారు. ఇప్పటికే 8 వేల కొత్త ఓటర్లకు ఈసీ ఓకే చెప్పగా.. మరో 16 వేల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్ని అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తారు? ఎంతమందిని జాబితాలో చేరుస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. మునుగోడులో ఓటు ఉంటే పార్టీల నుంచి నగదు, తాయిలాలు అందుతాయనే భావనతో నియోజకవర్గానికి చెందిన వారితోపాటు ఇతర ప్రాంతాల వారు ఓటు కోసం అప్లై చేసినట్లు తెలుస్తోంది.
వారంలో లిస్ట్‌లోకి 8 వేల మంది
సాధారణంగా ఏదైనా ఎన్నిక, ఉప ఎన్నిక జరిగినప్పుడు నామినేషన్ల ప్రక్రియ ముగిసే రోజు వరకు ఓటర్ లిస్ట్‌ను అప్డేట్ చేసేందుకు అవకాశం ఉన్నది. ఈ ఏడాది జనవరి 1 వరకు 18 ఏండ్లు నిండిన వారందరూ ఓటు హక్కుకు అర్హులు. షెడ్యూల్ ప్రకటించే నాటికి మునుగోడు ఓటర్ల సంఖ్య 2,27,268. మంగళవారం నాటికి ఈ సంఖ్య 2.35 లక్షలకు చేరింది. అంటే దాదాపు 8 వేల మంది కొత్తగా యాడ్ అయ్యారు. పెండింగ్‌లో ఇంకా 16 వేల అప్లికేషన్లు ఉన్నాయి. ఇందులో నుంచి ఇంకా ఓటర్ లిస్ట్‌లోకి అప్రూవ్ చేసేందుకు అవకాశం ఉన్నట్లు ఎలక్షన్ ఆఫీసర్లు వెల్లడించారు. మొత్తం ఓటర్ల సంఖ్య ఈ నెల 14నే తెలియనుంది. ఈ లిస్ట్‌ను అగ్జిలరీ ఓటరు లిస్ట్ కింద ప్రింట్ చేస్తారు. అయితే నాగార్జునసాగర్ బై ఎలక్షన్‌కు షెడ్యూల్ వచ్చిన టైంలో కొత్తగా ఓటు కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారి సంఖ్య 50లోపే ఉంది. కానీ, మునుగోడులో మాత్రం వేల సంఖ్యలో అప్లికేషన్లు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో మునుగోడుకు చెందిన నిజమైన ఓటర్లు ఎంతమంది అనేది తేల్చడం కూడా అంత ఈజీగా లేదని, బీఎల్వో(బూత్ లెవెల్ ఆఫీసర్లు)లు కూడా ఫీల్డ్‌లో ఎంక్వైరీ చేయకుండా దరఖాస్తులకు అప్రూవల్స్ ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
అప్లై చేసుకున్నరా? పార్టీలు పెట్టించినవా?
ఆగస్టు 8న మునుగోడు ఎమ్మెల్యే స్థానానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. హుజూరాబాద్ బై ఎలక్షన్లో విచ్చలవిడిగా ఓటర్లకు నగదు పంచారు. వేల రూపాయల విలువ చేసే గిప్ట్‌లు ఇచ్చారు. మునుగోడులో కూడా ఒక్కో పార్టీ ఓటుకు రూ.10 వేలకు తక్కువ కాకుండా ఇస్తాయని ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే మునుగోడు పక్క నియోజకవర్గాలు, హయత్ నగర్, ఎల్బీ నగర్ వంటి ప్రాంతాల నుంచి ఓటరు నమోదు కోసం ఆప్లై చేసుకున్నట్లు తెలిసింది. ఇందులో చాలామంది అధికార పార్టీ ప్రోద్బలంతో దరఖాస్తు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ఆప్లికేషన్లు పార్టీలే దగ్గరుండి పెట్టించాయని అంటున్నారు. మునుగోడులో ఓటుకు అర్హులు కానీవాళ్లు కూడా ఓటు హక్కు పొంది పోలింగ్‌లో పాల్గొంటే జయాపజయాలు తారుమారయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
