ఎమ్మెల్యేగా గెలిచిన తాపీ మేస్త్రీ భార్య

ఎమ్మెల్యేగా గెలిచిన తాపీ మేస్త్రీ భార్య

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అనూహ్యమైన రిజల్ట్ ఇది. ఓ రోజువారీ కూలీ భార్య ఎమ్మెల్యేగా ఎన్నికైంది. ఎలాంటి రాజకీయ వారసత్వం గానీ, పెద్ద అనుభవం గానీ లేని ఒక సాధారణ మహిళ ఏకంగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంపై అందరిలోనూ ఆనందం వ్యక్తమవుతోంది. సల్తోరా నియోజకవర్గం నుంచి బీజేపీ క్యాండిడేట్ గా పోటీ చేసిన చందనా బౌరి.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) క్యాండిడేట్ సంతోష్ కుమార్ మండల్ పై 4,218 ఓట్ల తేడాతో గెలుపొందింది. ఇప్పుడామె స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్, మనీ పవర్ లేకుండా ఒక సాధారణ మహిళ అద్భుతమైన విజయం సాధించిందంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. 

గ్రామ స్థాయి నుంచి ఎదిగి... 

చందనా బౌరి(30) భర్త తాపీ మేస్త్రీ. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. పేద కుటుంబం.. కూలీ డబ్బులతోనే జీవనం సాగుతోంది. చందన పేరు మీద రూ.31,985, ఆమె భర్త పేరు మీద రూ.30,311 విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయి.