చెల్లని రూపాయికి గీతలెక్కువ,కేసీఆర్ నోటికి వాతలెక్కువ: బండి సంజయ్

చెల్లని రూపాయికి గీతలెక్కువ,కేసీఆర్ నోటికి వాతలెక్కువ: బండి సంజయ్

కేసీఆర్... అసెంబ్లీలో చెంపలేసుకో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. చెల్లని రూపాయికి గీతలెక్కువ, కేసీఆర్ నోటికి వాతలెక్కువ, కోతలెక్కువ అని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి పదవి కోసం కేసీఆర్ కుటుంబసభ్యులు కొట్లాడుతున్నరు తప్ప మన రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం ఆలోచిస్తలేరన్నారు. ఇక్కడ రోడ్లు లేవని, మిషన్ భగీరథ నీళ్లు కూడా రావడం లేదని ఆరోపించారు. తెలంగాణలో ప్రతి ఇంటికీ నల్లా ద్వారా మిషన్ భగీరథ నీళ్లిస్తనన్న ముఖ్యమంత్రి.. ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మాగావ్ గ్రామంలో మాత్రం నీళ్లు రాలేదన్నారు. అవసరమైతే ఇక్కడికొచ్చి చూడు కేసీఆర్ అని సవాల్ విసిరారు. రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయని, డబుల్ బెడ్రూంలు కూడా రాలేదని ఆరోపించారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలేనని విమర్శించారు. 

మోడీ గారు ప్రధాని ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి దాదాపు రూ.4వేల కోట్లు ఇచ్చారని బండి సంజయ్ చెప్పారు. దాన్ని కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పేరు చెప్పి కోతలు కోస్తున్నారన్నారు. జాగున్నో్ళ్లకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తనన్న కేసీఆర్.. ఇప్పటివరకు ఎవరికి ఇచ్చాడో, ఎక్కడ ఇచ్చాడో తెలియదని ఎద్దేవా చేశారు. మళ్లీ ఇప్పుడేమో జాగున్నోళ్లకు రూ.3లక్షలు ఇస్తమంటున్నడని.. దీన్ని మళ్లీ నమ్ముతమా అని ప్రశ్నించారు. ఒకసారి రూ.3 లక్షలంటడు, మరొకసారి రూ.5 లక్షలంటడని, ఏమిచ్చినా అవి కేంద్రం నుంచి ఇచ్చేదేనని, అవి కూడా దారి మళ్లించిండని ఆరోపించారు. మహారాష్ట్రలో దసరా ఒక్కరోజునే లక్షల ఇళ్లకు గృహ ప్రవేశం చేయించిన ఘనత బీజీపేదేనని గర్వంగా చెప్పారు. 

డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రశ్నిస్తే.. ఇప్పటి వరకూ కేసీఆర్ సమాధానమివ్వలేదని బండి సంజయ్ చెప్పారు. కేంద్రమంత్రి వివరాలడిగినా ఎలాంటి సమాచారమివ్వలేదన్నారు. ఇళ్లిస్తానని కేసీఆర్ మోసం చేశాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మాగావ్ గ్రామంతో పాటు, తెలంగాణలోని నిలువ నీడ లేని పేదోళ్లకు ఇళ్లను కట్టించే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. 2.40లక్షల ఇళ్లను మోడీ గారు సాంక్షన్ చేశారని, ఒక్క ఇళ్లు కూడా కట్టించకుండా ఎలక్షన్లు రాగానే తెల్ల పేపర్లిచ్చి మళ్లీ ఓట్లు వేయించుకుంటాడన్నారు. ఎన్నికలు అయిపోగానే మన ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్ లో తాగి పడుకుంటడని విమర్శించారు.

జాబ్ నోటిఫికేషన్లు రేపే ఇస్తా అన్నాడు.. కానీ ఇప్పటికీ ఆ ఊసే లేదని బండి సంజయ్ అన్నారు. ఈ రోజు మాగావ్ లో ఎంతమందికి ఉద్యోగాలిచ్చిండో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. మనకు ఉద్యోగాలు రావని, ముఖ్యమంత్రి కుటుంబంలో ఉన్న వాళ్లకే ఉద్యోగాలన్నీ అని విమర్శించారు. సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇయ్యలేదు, ఉద్యోగాలు ఇయ్యలేదని ఆరోపించారు. కానీ మోడీ మాత్రం స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75వేల ఉద్యోగాలిచ్చారని, మొత్తం రెండు నెలల లోపల లక్షా 40వేల ఉద్యోగాలిచ్చిన ఘనత బీజేపీదేనని తెలిపారు. 

రుణమాఫీ చేస్తానన్న కేసీఆర్.. ఈ 8 సంవత్సరాలలో నష్టపోయిన ఏ రైతుకూ కనీసం నష్ట పరిహారం ఇవ్వలేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రైతు బంధు ఇచ్చి, మొత్తం రైతులను నట్టేట ముంచాడన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే.. రాష్ట్రం వచ్చాక మాత్రం వీడియోలు తీసుకొని మరీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మోడీ గారు చూస్తుంటే.. అభివృద్ధి కాకుండా సీఎం కేసీఆర్ సహకరించడంలేదని ఆరోపించారు. ప్రశ్నిస్తే బీజేపీ నేతలపై కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తారా? బండి సంజయ్ నిలదీశారు. తనతో సహా బీజేపీ కార్యకర్తలకు జైళ్లు కొత్త కాదని, ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళతామని స్పష్టం చేశారు. తమ లక్ష్యం గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేయడమేన్న బండి సంజయ్... పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తమ అంతిమ లక్ష్యమని హామీ ఇచ్చారు.