
- నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో హైకమాండ్
- పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో హైకమాండ్ ధీమా
- హుజూరాబాద్ బై పోల్లో గెలుపుపై మోడీ, నడ్డా విషెస్
న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎగిరేది కాషాయ జెండానేనని బీజేపీ హైకమాండ్ ధీమా వ్యక్తం చేసింది. ఆ దిశలో కేంద్ర నాయకత్వం వ్యూహాలు రచిస్తోందని స్పష్టం చేసింది. దక్షిణాదిలో కర్నాటక తర్వాత తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందని, ఈ విషయంలో జాతీయ నేతల్లో అందరికీ విశ్వాసం ఉందని స్పష్టం చేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపిందంది. ఆదివారం ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో జ రిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ లో హుజూరాబాద్ రిజల్ట్స్, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ నడ్డా ప్రస్తావించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముగింపు ఉపన్యాసంలో పాల్గొన్న మోడీ.. హుజూరాబాద్ బై పోల్ విజయంపై పార్టీ శ్రేణులను అభినందించారు. ఇదే దిశలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కొత్త కమిటీ ఏర్పాటయ్యాక తొలి భేటీ
ఉదయం ఎగ్జిక్యూటివ్మీటింగ్ ను పార్టీ చీఫ్నడ్డా ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. తాజా ఉప ఎన్నికల్లో హుజురాబాద్ లో గెలవడం, ఏపీలోని బద్వేల్ లో బీజేపీకి దాదాపు 21 వేల ఓట్లు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదే జోష్ తో రాష్ట్రంలో బీజేపీ తప్పక అధికారంలోకి వస్తుందని, పార్టీ ముఖ్య నేతల్లో ఆ నమ్మకం బలంగా ఉందని చెప్పారు. ఏపీలో మెల్లమెల్లగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. కొత్తగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటయ్యాక తొలిసారి సమావేశం జరిగింది. వంద మంది జాతీయ నేతలు, ఆఫీసు బేరర్లు ప్రత్యక్షంగా మీటింగ్ లో పాల్గొనగా మిగిలిన నేతలు ఆయా రాష్ట్రాల నుంచి వర్చువల్ మోడ్ లో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ నేరుగా హాజరయ్యారు. స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, వివేక్ వెంకట స్వామి, ఈటల రాజేందర్, రాజా సింగ్, విజయ శాంతి, జితేందర్ రెడ్డి, గరికపాటి వర్చువల్గా పాల్గొన్నారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని డీకే అరుణ అన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చే దిశలో కేంద్ర పథకాలను గ్రామగ్రామానికి, ప్రతి ఇంటికీ తీసుకెళ్తామని చెప్పారు.
బూత్ లెవల్లో మరింత పటిష్టంగా పార్టీ: లక్ష్మణ్
బూత్ లెవల్, ఓటర్ లిస్ట్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో నిర్ణయించినట్లు లక్ష్మణ్ తెలిపారు. దీంతో పాటు త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల వ్యూహ రచన, 100 కోట్లు దాటిన వ్యాక్సినేషన్ డ్రైవ్, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఫ్రీగా టీకా పంపిణీ, పేదల కోసం మోడీ సర్కారు తెచ్చిన సంక్షేమ పథకాలపై చర్చించినట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించని రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో ఆందోళనలు చేయాలని పార్టీ నాయకత్వం ఆదేశించిందని చెప్పారు.