క్రికెట్ లో ఒక జట్టు 40 పరుగుల టార్గెట్ ను కాపాడుకోవడం దాదాపు అసాధ్యం. అయితే పాకిస్థాన్ డొమెస్టిక్ క్రికెట్ లీగ్ లో అద్భుతం చోటు చేసుకుంది. సుయ్ నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్టుపై పాకిస్తాన్ టెలివిజన్ జట్టు ఫస్ట్-క్లాస్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఇప్పటివరకు అత్యల్ప లక్ష్యాన్ని కాపాడుకొని చరిత్ర సృష్టించింది. సుయ్ నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ 40 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయలేక కేవలం 37 పరుగులకే ఆలౌటైంది. దీంతో పాకిస్థాన్ టెలివిజన్ జట్టు రెండు పరుగుల తేడాతో విజయం సాధించి సంచలన గెలుపు అందుకుంది.
మ్యాచ్ ఎలా జరిగిందంటే..?
ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన PTV జట్టు తొలి ఇన్నింగ్స్ లో 166 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన SNGPL తమ తొలి ఇన్నింగ్స్ లో 238 పరుగులు చేసింది. దీంతో తొలి ఇనింగ్స్ లో సుయ్ నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్టుకు 72 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ టెలివిజన్ జట్టు మరోసారి బ్యాటింగ్ లో విఫలమైంది. కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో సుయ్ నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్ లిమిటెడ్ జట్టు ముందు కేవలం 40 పరుగుల టార్గెట్ ఉంది. లక్ష్య ఛేదనలో PTV బౌలర్లు చెలరేగడంతో SNGPL జట్టు అనూహ్యంగా 37 పరుగులకే ఆలౌటైంది.
పాకిస్థాన్ టెలివిజన్ జట్టులో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అలీ ఉస్మాన్ స్టార్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్ లో తొమ్మిది పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు తొలి ఇన్నింగ్స్ లో కూడా నాలుగు వికెట్లు తీసుకొని ఓవరాల్ గా మ్యాచ్ లో 10 వికెట్ల ఘనతను అందుకున్నాడు. అలీ ఉస్మాన్ తో పాటు ఫాస్ట్ బౌలర్ అమద్ బట్ కూడా రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. 232 డొమెస్టిక్ క్రికెట్ లో పాకిస్థాన్ టెలివిజన్ జట్టు అత్యల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. 1794లో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్ లో ఓల్డ్‌ఫీల్డ్‌ను 34 పరుగులకే ఆలౌట్ చేసి 41 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. తాజాగా పాకిస్థాన్ టెలివిజన్ జట్టు 40 పరుగుల టార్గెట్ ను కాపాడుకొని ఈ రికార్డ్ బ్రేక్ చేసింది.
