పార్టీని అడ్డం పెట్టుకుని దందాలు చేస్తే ఊరుకోం : బీఎల్ సంతోష్

పార్టీని అడ్డం పెట్టుకుని దందాలు చేస్తే ఊరుకోం : బీఎల్ సంతోష్
  • పదవులు ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి : బీఎల్ సంతోష్

హైదరాబాద్, వెలుగు:  పార్టీని అడ్డం పెట్టుకుని దందాలు చేస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హెచ్చరించారు. ‘‘పార్టీ పదవులు తీసుకున్నది మీ సొంత వ్యాపారాలు చక్కబెట్టుకునేందుకు కాదు. ఢిల్లీ నుంచి ప్రతీ నాయకుడి పనితీరుపై నిఘా ఉంటది. ఫ్లెక్సీల్లో ఫొటోలు, సోషల్ మీడియాల్లో పోస్టులు పెట్టడం కాదు.. జనంలోకి వెళ్లి వారి గుండెల్లో స్థానం సంపాదించండి. 

వ్యక్తిగత గ్రూపులు మాని.. పార్టీని నమ్ముకుని పని చేయండి’’అని నేతలకు ఆయన సూచించారు. తుక్కుగూడలో బీజేపీ రాష్ట్ర స్థాయి సంఘటనాత్మక కార్యశాల ఆదివారం పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు అధ్యక్షతన జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్​గా బీఎల్ సంతోష్ హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. ‘‘2028లో అధికారంలో రావడమే లక్ష్యంగా పని చేయాలి. జమిలీ ఎన్నికలు ఉండవు. నేతలంతా ఐక్యంగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీదే అధికారం. దీనికోసం ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సంసిద్ధం కావాలి. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతది. 

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. మహిళా నేతలు ఎవరో ఒక లీడర్ పేరు చెప్పుకొని కాకుండా.. సొంతగా గుర్తింపు తెచ్చుకునేలా క్షేత్రస్థాయిలో పని చేయాలి’’అని ఆయన సూచించారు.

బాస్ ఈజ్ బాస్.. లైట్ తీసుకుంటే కుదరదు

రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావును ఉద్దేశిస్తూ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉన్నా.. బాస్ ఈజ్ బాస్. మీటింగ్ పెడితే కొందరు లైట్ తీసుకున్నట్టు తెలిసింది. ఈ పద్ధతి మార్చుకోవాలి. ఇక్కడ జరిగిన ప్రతిదీ మా దృష్టికి వస్తది. అన్నీ ఆలోచించి రాంచందర్ రావును అధ్యక్షుడిగా పెట్టినం. ఆయన పదవీకాలం అయిపోయేదాకా ఆయనే స్టేట్ చీఫ్​గా ఉంటారు. లీడర్లు గ్రూపులుగా సమావేశాలు, లంచ్ మీటింగ్​లు పెట్టుకోవద్దు. ఏది చేసినా అధ్యక్షుడికి చెప్పి చేయాలి. 

లీడర్లను నమ్ముకుని ముందుకెళ్లొద్దు. చివరికి నన్ను నమ్ముకుని కూడా పని చేయకండి. పార్టీని మాత్రమే నమ్ముకోండి. లీడర్ల కోసం కాకుండా పార్టీ కోసం మాట్లాడండి. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోతే పార్టీకే కాదు.. వ్యక్తిగతంగా మీకూ నష్టమే’’అని హితవు పలికారు. కష్టపడి పనిచేసే వారికి పార్టీలో కచ్చితంగా గుర్తింపు, అవకాశాలు ఉంటాయని భరోసా ఇచ్చారు.

గాలి మాటలు వద్దు.. గ్రౌండ్ లోకి వెళ్లండి

సోషల్ మీడియాను నమ్ముకుంటే సరిపోదని, జనంలోకి వెళ్లని వాళ్లు పదవుల నుంచి తప్పుకోవాలని బీఎల్ సంతోష్ హెచ్చరించారు. ‘‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై సమీక్ష చేసుకోవాలి. కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలి. స్థానిక సంస్థల ఎన్నికలను ఉపయోగించుకుని కేడర్​ను లీడర్లుగా తయారు చేయాలి’’అని ఆయన అన్నారు. 

ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ నేతలు శివప్రకాశ్, అర్వింద్ మీనన్, డీకే అరుణ, కే.లక్ష్మణ్, సంబిత్ పాత్ర, అభయ్ పాటిల్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి ముఖ్య నేతలు పాల్గొన్నారు.