
- 17 సైనిక స్థావరాలు, ప్రభుత్వ సంస్థలపై దాడులు
- ఆర్మీకి, పాక్ ప్రభుత్వానికి భారీ నష్టం!
క్వెట్టా: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ‘ఆపరేషన్ బామ్’ పేరిట భారీ స్థాయిలో దాడులకు పాల్పడుతున్నది. జులై 8 వ తేదీ(మంగళవారం) రాత్రి నుంచి మక్రాన్ తీరం నుంచి కోహ్-ఎ-సులేమాన్ పర్వతాల వరకు పలు జిల్లాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి వరకు బీఎల్ఏ మొత్తం 17 సైనిక స్థావరాలు, పలు కమ్యూనికేషన్ కేంద్రాలు, వివిధ ప్రభుత్వ సంస్థలపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. ఈ దాడులు పాక్ సైన్యం, ప్రభుత్వానికి భారీగా నష్టం కలిగించినట్టు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బలూచిస్తాన్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు పేర్కొన్నాయి.
‘‘ఆపరేషన్ బామ్’’ను ‘బలోచ్ జాతీయ విమోచన యుద్ధంలో కొత్త ఉదయం’గా పేర్కొంటూ బీఎల్‌ఏ అధికార ప్రతినిధి మేజర్ గ్వహ్రామ్ బలోచ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ఆర్మీ, ప్రభుత్వం పాల్పడుతున్న కిడ్నాపులు, మానవ హక్కుల ఉల్లంఘనల నేపథ్యంలో దీన్ని చేపట్టినట్టు తెలిపారు. గత ఆరు నెలలుగా బీఎల్ఏ 284 దాడులు చేసినట్టు చెప్పారు. ఒక రైలు హైజాక్, మూడు ఆత్మాహుతి దాడులు, 121 బాంబు దాడులు, 131 వాహనాలు ధ్వంసం చేసినట్టు అందులో వివరించారు.