షుగర్ లేకున్నా సోకుతున్న బ్లాక్ ఫంగస్

షుగర్ లేకున్నా సోకుతున్న బ్లాక్ ఫంగస్
  • డయాబెటిస్ లేనోళ్లకూ సోకుతున్న ఫంగల్ ఇన్ఫెక్షన్ 
  • రాష్ట్రంలో 1,162 మంది పేషెంట్లపై స్టడీ 

హైదరాబాద్‌, వెలుగు: కరోనా తరహాలోనే బ్లాక్ ఫంగస్ కూడా చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ సోకుతోంది. ఫంగస్ బారిన పడినవాళ్లలో రెండేండ్ల పిల్లల నుంచి 90 ఏండ్ల వృద్దుల వరకూ ఉన్నారు. రాష్ట్రంలో1,162 మంది బ్లాక్ ఫంగస్‌ బాధితులపై హెల్త్ డిపార్ట్‌మెంట్ ఓ స్టడీ చేసింది. వీరిలో ఏడేండ్లలోపు చిన్నారులు ఏడుగురు ఉన్నారు. వీరికి కరోనా చికిత్స తీసుకుంటుండగానే ఫంగస్ ఎటాక్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. ఫంగస్ బాధితుల్లో సగం మంది మధ్య వయస్కులే ఉంటున్నారు. అయితే డయాబెటిస్ ఉన్నోళ్లకే ఫంగస్ ఎటాక్ అవుతోందన్న వాదనను ఈ స్టడీ తోసిపుచ్చింది. 1,162 మంది రోగుల్లో.. 303 మందికి అసలు షుగర్ హిస్టరీ లేదని తేల్చింది. కరోనా కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల వీరికి ఫంగస్ ఎటాక్ అయి ఉంటుందని అంచనా వేసింది. అలాగే స్టెరాయిడ్స్ వినియోగించని వాళ్లు 26.7 శాతం మంది ఉన్నారు. ఈ లెక్కన స్టెరాయిడ్స్‌ మాత్రమే ఫంగస్‌ ఎటాక్‌కు కారణం కాదని డాక్టర్లు తేల్చారు. అలాగే, కరోనా హిస్టరీలేని 11 మందికి కూడా బ్లాక్ ఫంగస్ సోకినట్టు స్టడీలో గుర్తించారు. 

ఆగని కేసులు
బ్లాక్ ఫంగస్ కేసులు ఇప్పటికీ పదుల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. కోఠి ఈఎన్టీ హాస్పిటల్‌లో గడిచిన రెండు రోజుల్లోనే 31 మంది పేషెంట్లు అడ్మిట్ అయ్యారు. ఆ దవాఖానలో ఇప్పటివరకూ మొత్తం 924 మంది అడ్మిట్ అవగా, ప్రస్తుతం అక్కడ 171 మంది ఉన్నారు. గాంధీలో సుమారు 500 మంది అడ్మిట్ అవ్వగా, అందులో 150 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకో 320 మంది పేషెంట్లు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య2500 దాటగా, వంద మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలతో పాటు, నల్గొండ, నిజామాబాద్‌, కరీంనగర్‌‌, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి.