
= సరిహద్దు గ్రామాలు, పట్టణాల్లో లైట్స్ ఆఫ్
= భారత్–పాక్ ఇరు దేశాల్లోనూ అదే పరిస్థితి
= కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్
= ఈ రోజు రాత్రికి ఏం జరుగుతుందో..?
ఢిల్లీ: భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు గ్రామాలు, పట్టణాల ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. రాత్రి 8 గంటల తర్వాత బ్లాక్ అవుట్ విధిస్తుండటంతో కారు చీకట్లోనే కాలం వెల్లదీస్తున్నారు. ఈ నెల 7న రాత్రి పాకిస్తాన్ మన దేశంలోని 15 సైనిక స్థావరాలను టార్గెట్ చేసుకొని దాడులకు ఉపక్రమించగా భారత సేనలు తిప్పికొట్టాయి. నిన్న రాత్రి భారత సేనలు సైతం డ్రోన్ దాడులకు దిగాయి.
కరాచీ, లాహోర్, రావల్పిండిలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులకు దిగింది. భారత్ 25 డ్రోన్లను పాకిస్తాన్ కట్టడి చేయలేక పోయింది. ఇవాళ తెల్లవారు జామున భీకర పోరుకు దిగింది. పాక్ విరుచుకు పడే అవకాశం ఉందని భావించిన భారత ఆర్మీ అమృత్ సర్ లో బ్లాక్ అవుట్ విధించింది. రాజస్థాన్, పంజాబ్, కాశ్మీర్, గుజరాత్ లోని సరిహద్దు గ్రామాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పాక్ సరిహద్దుల్లో కీలక ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌లో పూర్తిగా యుద్ధవాతావరణం నెలకొంది. ముఖ్యంగా జమ్ము, రాజోరీ, ఉధంపూర్, శ్రీనగర్ ప్రాంతాలను చీకట్లు కమ్ముకున్నాయి. జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ వేసిన మిసైల్స్‌ను భారత సైన్యం ఆకాశంలోనే పేల్చేసింది. ఈ ప్రాంతాలపై సైన్యం ప్రత్యేక నిఘా, బ్లాకౌట్‌లు అమలు చేస్తోంది. అటు పాకిస్తాన్ లోని లహోర్, పేషావర్, ఫైసలాబాద్, ముల్తాన్, కరాచీ, ఖైబర్ నగరాలు, పరిసర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇవాళ రాత్రికి ఏం జరుగుతుందోనన్న టెన్షన్ ముఖ్యంగా సరిహద్దు గ్రామాలను వెంటాడుతోంది.