డబ్బులు ఇవ్వాలని రిపోర్టర్ల బ్లాక్ మెయిల్

డబ్బులు ఇవ్వాలని రిపోర్టర్ల బ్లాక్ మెయిల్
  •  ఒత్తిడి భరించలేకనే ముగ్గురు కొడుకులను చంపేసి రవి ఆత్మహత్య 
  • ఈ నెల 3న ఘటన 
  • ఇద్దరు రిపోర్టర్లు, హోంగార్డు అరెస్టు.. మరో ఏడుగురి కోసం గాలింపు 

 గండిపేట, వెలుగు: ముగ్గురు కొడుకులను చంపేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న నీరటి రవి కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసం స్థానిక రిపోర్టర్లు బ్లాక్ మెయిల్ చేయడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు రాజేంద్రనగర్‌‌ జోన్‌‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌‌ తెలిపారు. మొత్తం 10 మందిని నిందితులుగా గుర్తించామని.. వీరిలో ఐదుగురు రిపోర్టర్లు, ఒక హోంగార్డు ఉన్నాడని చెప్పారు. ఇద్దరు రిపోర్టర్లు, హోంగార్డును అరెస్టు చేశామని.. మిగతా వాళ్ల కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేసు వివరాలను బుధవారం వెల్లడించారు. 

టంగుటూరు గ్రామానికి చెందిన నీరటి రవికి 2022లో గుంటూరులో తిరుపతిరావు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆయన జీఎస్‌‌ఎన్‌‌ ఫైనాన్స్ కంపెనీకి చెందిన మనీ సర్క్యులేషన్ స్కీమ్ గురించి రవికి వివరించాడు. ఎక్కువ మొత్తంలో డబ్బులొస్తాయని చెప్పడంతో రవి అందులో మెంబర్​గా చేరాడు. మొదట రూ.2 వేలు చెల్లించగా, 45 రోజుల తర్వాత ఆ డబ్బు తిరిగి ఇచ్చారు. ఆ తర్వాత నెలకు రూ.వెయ్యి చొప్పున ఆరు నెలలు చెల్లించారు. దీంతో రవి తనకు పరిచయం ఉన్నవాళ్లతో పెద్ద మొత్తంలో స్కీమ్ లో డబ్బులు పెట్టించాడు. అవన్నీ తిరుపతిరావుకు పంపించాడు.

 తిరిగి తిరుపతిరావు పంపించే డబ్బులను సభ్యులకు ఇచ్చేవాడు. ఈ వ్యాపారం బాగా నడుస్తున్న సమయంలోనే రవి తన ఊర్లో 39 గుంటల భూమి కోనుగోలు చేసి ఫంక్షన్ హాల్ నిర్మాణం మొదలుపెట్టాడు. అయితే గత 3 నెలల నుంచి తిరుపతిరావు డబ్బులు చెల్లించకపోవడంతో గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్లు డబ్బుల కోసం రవిపై ఒత్తిడి చేశారు. 

20 లక్షలు ఇవ్వాలని డిమాండ్.. 

రవి పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని స్థానిక రిపోర్టర్లకు తెలిసింది. దీంతో వాళ్లు ఆయనను కలిశారు. ‘‘ప్రజలతో డబ్బులు కట్టించి తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నావు. ప్రభుత్వ భూమిలో ఫంక్షన్‌‌ హాల్‌‌ కడుతున్నావు. ఇదంతా మేం న్యూస్ పేపర్లలో రాస్తాం. న్యూస్ రాయవద్దంటే రూ.20 లక్షలు ఇవ్వు” అని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో భయపడిపోయిన రవి.. తన భార్య బంగారు నగలు తాకట్టు పెట్టి రిపోర్టర్లకు రూ.2.50 లక్షలు ఇచ్చాడు. ఇదే తీరుగా హోంగార్డు నాగరాజు బెదిరించడంతో తన భూమి కుదువపెట్టి రూ.18 లక్షలు అతనికి చెల్లించాడు.

 ఈ క్రమంలో తమకు ఇస్తానన్న మిగతా డబ్బులివ్వాలని రిపోర్టర్లు కూడా ఒత్తిడి చేశారు. దీంతో విసిగిపోయిన రవి.. ఈ నెల 3న తన ముగ్గురు కొడుకులకు ఇంట్లో ఉరివేసి, తాను ఫంక్షన్ హాల్ దగ్గర ఉరేసుకున్నాడు. రవి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీసీపీ తెలిపారు. నిందితులను తిరుపతిరావు, స్థానిక రిపోర్టర్లు మంగలి శ్రీనివాస్‌‌, కురుమ శ్రీనివాస్‌‌, వడ్డే మహేశ్, సిరిపురం శ్రీనివాస్‌‌రెడ్డి, సంకే ప్రవీణ్‌‌కుమార్‌‌, హోంగార్డు నాగరాజుతో పాటు ఆలూరు రాజు, మనీలా, రామకృష్ణలుగా గుర్తించామని చెప్పారు. వీరిలో ఇద్దరు రిపోర్టర్లు ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్‌‌రెడ్డి, హోంగార్డు నాగరాజును అరెస్టు చేసి రిమాండ్‌‌కు తరలించామని వెల్లడించారు. మిగతా వారి కోసం గాలిస్తున్నామని పేర్కొన్నారు.