పఠాన్ కోట్ లో సైరన్ల మోత ..పంజాబ్​లోని పలు జిల్లాల్లో హైఅలర్ట్

పఠాన్ కోట్ లో సైరన్ల మోత ..పంజాబ్​లోని పలు జిల్లాల్లో  హైఅలర్ట్
  • భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారుల చర్యలు  

చండీగఢ్: పంజాబ్ లోని పఠాన్ కోట్, జలంధర్ జిల్లాలో పేలుడు శబ్దాలు వినిపించడంతో అధికారులు హైఅలర్ట్ అయ్యారు. హోషియార్ పూర్, అమృత్ సర్, ఫిరోజ్ పూర్ లో ఎయిర్ సైరన్లు మోగించారు. పఠాన్ కోట్ లో ముందు జాగ్రత్త చర్యగా మార్కెట్లను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం 24 గంటల పాటు పని చేసే కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఆకాశం నుంచి ఏదైనా వస్తువు భూమ్మీద పడితే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని లేదా కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని పఠాన్ కోట్ డిప్యూటీ కమిషనర్ ప్రజలను కోరారు. కొందరు ఆ వస్తువులను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అవి ప్రమాదకరంగా మారొచ్చని ఆయన తెలిపారు. అటువంటి వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

జలంధర్ లో కార్మికుడికి గాయం

జలంధర్ జిల్లాలోని కంగనివాల్ గ్రామంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వస్తువు భూమ్మీద పడింది. ఈ ఘటనలో ఒక వలస కార్మికుడు గాయపడ్డాడు. ఆ ప్రాంతంలోని కొన్ని ఇండ్లు కూడా దెబ్బతిన్నాయి. గాయపడిన కార్మికుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రజలందరూ ఒకే దగ్గర గుమికూడొద్దని జలంధర్ డిప్యూటీ కమిషనర్ హిమాన్షు అగర్వాల్ చెప్పారు. బయట తిరగొద్దని, ఎత్తైన భవనాల్లో ఉండొద్దని సూచించారు. జలంధర్ కంటోన్మెంట్, ఆదంపూర్ లో మార్కెట్లను మూసివేయాలని ఆయన ఆదేశించారు.

ఫగ్వారాలో మాల్స్, వాణిజ్య భవనాల మూసివేత

ఫగ్వారా సిటీలో అన్ని మార్కెట్లను మూసివేయాలని అడిషనల్ డిప్యూటీ కమిషనర్ అక్షితా గుప్తా ఆదేశాలిచ్చారు. మెడికల్ స్టోర్లకు మాత్రం మినహాయింపునిచ్చారు. జిల్లా ఇతర ప్రాంతాల్లోని మాల్స్, వాణిజ్య భవనాలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. కపుర్తాలాలో కూడా అన్ని వాణిజ్య సంస్థలను మూసేయాలని శనివారం అధికారులు ఆదేశాలిచ్చారు. హర్యానాలోని సిర్సాలో అర్ధరాత్రి తర్వాత పేలుడు లాంటి శబ్దాలు విన్నామని కొందరు స్థానికులు పేర్కొన్నారు. అర్ధరాత్రి తర్వాత ఒక గ్రామంలోని పొలాల్లో గుర్తు తెలియని లోహపు వస్తువులను కనుగొన్నామని వివరించారు. రక్షణ బలగాలు వచ్చి ఆ శిథిలాలను సేకరించాయని వెల్లడించారు.