అడ్డుకున్న పోలీసులు.. వందలాది మంది అరెస్ట్

 అడ్డుకున్న పోలీసులు.. వందలాది మంది అరెస్ట్

హైదరాబాద్, వెలుగు: బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని, జీవో 317తో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్​పీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. వివిధ జిల్లాల్లో టీచర్లను ముందస్తు అరెస్ట్ చేసినా వేలాది మంది మంగళవారం హైదరాబాద్​చేరుకున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీగా బయలుదేరిన టీచర్లు.. పోలీసులను తప్పించుకుంటూ బషీర్ బాగ్, పోలీస్ కంట్రోల్ రూమ్ వరకూ చేరుకున్నారు. పోలీసులు అక్కడ బారికేడ్లు పెట్టి టీచర్లను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు, టీచర్లకు మధ్య తోపులాట, వాగ్వావాదం జరిగింది. ఈ క్రమంలో టీచర్లను అరెస్టు చేసి ఆసిఫ్ నగర్, గోషామహల్, నారాయణగూడ, గోల్కొండ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఈ సందర్భంగా యూఎస్​పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు జంగయ్య, అశోక్ కుమార్, రఘుశంకర్ రెడ్డి, చావ రవి, లింగారెడ్డి, షౌకత్ అలీ, వెంకట్రావ్ మాట్లాడారు. ఏడేండ్ల నుంచి ప్రమోషన్లు, నాలుగేండ్ల నుంచి బదిలీలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. 13 జిల్లాల స్పౌజ్ టీచర్లకు న్యాయం చేయాలని, బడుల్లో విద్యావాలంటీర్లను, స్వచ్ఛ కార్మికులను నియమించాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్లకు సరిపడా పుస్తకాలు, యూనిఫామ్స్ సరఫరా చేయాలని కోరారు. తమ పోరాటం కేవలం టీచర్ల కోసమే కాదని.. సర్కారు బడులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసమని చెప్పారు. మన ఊరు–మన బడి, ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తున్న ప్రభుత్వం.. బడుల్లో టీచర్ల కొరత మాత్రం తీర్చడం లేదని వాపోయారు. అరెస్టులతో తమ పోరాటాన్ని ఆపలేరని, దసరా సెలవుల్లోగా ప్రభుత్వం స్పందించాలని లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.