హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

హైదరాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

సికింద్రాబాద్ : నెల రోజుల్లో 46,340 మంది ఆర్టీసీ ఉద్యోగులకు మెడికల్ టెస్టులు చేసి రికార్డు సృష్టించామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. ‘‘గ్రాండ్ హెల్త్ చాలెంజ్”పేరుతో నిర్వహించిన ఈ పరీక్షల్లో.. గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న దాదాపు 300 మంది ఉద్యోగుల ప్రాణాలు కాపాడామన్నారు. తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్​లో చల్లా చారిటబుల్ ట్రస్ట్, టీఎస్ఆర్టీసీ కలిసి ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్​ను మంగళవారం ఆయన ప్రారంభించారు. తర్వాత గ్రాండ్ హెల్త్ చాలెంజ్, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు నెలల్లో విడతల వారీగా 50వేల మంది సిబ్బందికి నైపుణ్య శిక్షణ అందించామన్నారు. నవంబర్​లో నిర్వహించిన గ్రాండ్ హెల్త్ చాలెంజ్​లో సేకరించిన డేటా ఆధారంగా సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో వైద్య సేవలు అందించేందుకు త్వరలో ప్రతీ డిపోలో హెల్త్ వలంటీర్లను నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆర్టీసీ సిబ్బంది, ప్రజలు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన అల్ట్రా సౌండ్ స్కానింగ్ మెషీన్​ను ప్రారంభించి, ఆర్టీసీ భవన విస్తరణ పనులు పరిశీలించారు. కార్యక్రమంలో మెడికల్ అడ్వైజర్ సైదిరెడ్డి, సీపీఎం కృష్ణకాంత్, సీఎఫ్ఎం విజయపుష్ప, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ, మెడికల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ 
శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సావిత్రిబాయి ఫూలేకు ఘన నివాళి
గండిపేట : గ్రేటర్​లో సావిత్రిబాయి ఫూలే జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. విద్యానగర్​లోని బీసీ భవన్​లో సావిత్రిబాయి ఫొటోకు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ముషీరాబాద్ చౌరస్తాలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు పూసరాజు సావిత్రిబాయి ఫొటోకు నివాళులర్పించారు. రాంనగర్​లో బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో బీజేవైఎం నగర అధ్యక్షుడు మద్దూరు శివాజీ పాల్గొన్నారు. మహాజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జయంతి సభ జరిగింది. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, ప్రముఖ జర్నలిస్ట్ సతీశ్​చందర్, హాజరై సావిత్రిబాయి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ పాల్గొన్నారు. కార్వాన్ సెగ్మెంట్ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సావిత్రిబాయికి నివాళులర్పించారు. గౌతంనగర్ డివిజన్​లోని సావిత్రి బాయి, జ్యోతిరావు బాఫూలే విగ్రహాలకు బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజేంద్రనగర్ జూనియర్ కాలేజీలోని ఫూలే విగ్రహం వద్ద మహాత్మ జ్యోతిరావు ఫూలే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అత్తాపూర్ 
కార్పొరేటర్ సంగీత, మైలార్​దేవ్ పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు నివాళులర్పించారు.

అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో

హైదరాబాద్ : నాంపల్లి గ్రౌండ్​లో మొదలైన నుమాయిష్​ఎగ్జిబిషన్ సందర్భంగా మెట్రో రైళ్ల టైమింగ్స్ పెంచుతున్నట్లు హెచ్ఎంఆర్ఎల్ ప్రకటించింది. ఫిబ్రవరి 15 వరకు అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. ఎల్​బీ నగర్, మియాపూర్, నాగోల్​, రాయదుర్గం నుంచి రాత్రి 12 గంటలకు చివరి రైళ్లు బయలుదేరి వెళ్తాయని తెలిపింది. ఇప్పటి వరకు రాత్రి 11 గంటల వరకు నడుస్తుండగా పెంచిన సమయంతో గంట పొడిగించినట్లయింది. అయితే మియాపూర్ నుంచి ఎల్బీనగర్(రెడ్​లైన్), నాగోలు నుంచి రాయదుర్గం(బ్లూ లైన్) రూట్లలో మాత్రమే పెంచిన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఎంజీబీఎస్​– జేబీఎస్(గ్రీన్​లైన్)​రూట్​లో ఎలాంటి మార్పు ఉండదు. నుమాయిష్ రద్దీ దృష్ట్యా గాంధీభవన్ మెట్రో స్టేషన్​లో అదనపు టికెట్​కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మెట్రో అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.