రక్తం దొరుకుతలే: ఇండియా సహా 119 దేశాల్లో కొరత

రక్తం దొరుకుతలే: ఇండియా సహా 119 దేశాల్లో కొరత

ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 కోట్ల యూనిట్లు కావాలె 

    సప్లై అవుతున్నది 27 కోట్ల యూనిట్ల రక్తమే  

    ఇండియాలో 4 కోట్ల యూనిట్ల రక్తం కొరత  

    యూనివర్సిటీ ఆఫ్​ వాషింగ్టన్ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌లో వెల్లడి 

ఓ యువకుడికి యాక్సిడెంట్ అయి రక్తం బాగా పోయింది. వెంటనే హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో చేర్చారు.  కానీ ఎక్కించేందుకు రక్తం లేకపోతే అతడి పరిస్థితి ఏమవుతుంది? ఓ వ్యక్తికి అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వచ్చింది. రక్తం దొరికితే తప్ప సర్జరీ చేసేందుకు వీలుకాకపోతే అతడి కష్టం ఎలా ఉంటుంది? ఇలాంటోళ్లే కాదు.. ఎనీమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియా, కేన్సర్, డెంగీ, మలేరియా వంటి ఎన్నో రోగాలతో రక్తం, ప్లేట్ లెట్ల వంటివి తగ్గిపోతే వారికి వెంటనే రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా119 దేశాల్లో తీవ్రమైన రక్తం కొరత ఉందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ వాషింగ్టన్ రీసెర్చర్లు వెల్లడించారు. ఇండియాలో కూడా డిమాంచ్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే రక్తం కొరత చాలా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు. మన దేశంలో సుమారుగా ఏటా 4.1 కోట్ల యూనిట్ల రక్తం కొరత ఉండవచ్చని అంచనా వేశారు.

ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల యూనిట్ల కొరత

ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ బ్లడ్ సేఫ్టీ, అవైలెబిలిటీ’తో పాటు ‘2017 గ్లోబల్ బర్డెన్ ఆఫ్​డిసీజ్’ నివేదిక ఆధారంగా196 దేశాల్లో ఒక్కో దేశానికి ఎంత రక్తం అవసరం? ఎంత దొరుకుతోంది? అన్న విషయాలను అంచనా వేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏటా 30.3 కోట్ల యూనిట్ల రక్తం అవసరం కాగా, 27.2 కోట్ల యూనిట్ల రక్తం సరఫరా అవుతోందని తెలిసింది. అంటే దాదాపు 3.1 కోట్ల యూనిట్ల రక్తం కొరత ఉన్నట్లు తేలింది. కానీ వాస్తవానికి119 దేశాల్లో రక్తం కొరత చాలా తీవ్రంగా ఉందని, ఆయా దేశాల్లో సీజన్ల వారీగా వచ్చే వ్యాధులు, కావాల్సిన రక్తాన్ని అంచనా వేస్తే.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు10 కోట్ల యూనిట్ల రక్తం కొరత ఉండవచ్చని రీసెర్చర్లు అంచనా వేశారు.

1000కి10 మంది రక్తదానం చేయాలె

ఒక్కో దేశంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు కనీసం10 మంది రక్తదానం చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ టార్గెట్ పెట్టింది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ టార్గెట్ కు ఎంతో దూరంలో ఉన్నాయని అమెరికా రీసెర్చర్లు చెబుతున్నారు. అన్నింటికంటే దక్షిణ సూడాన్ లో అత్యంత తక్కువగా.. ప్రతి లక్ష మందికి కేవలం46 యూనిట్ల రక్తం మాత్రమే అందుబాటులో ఉందని వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాలకు ఇప్పుడు అందుబాటులో ఉన్న రక్తం కంటే 75 రెట్లు ఎక్కువ రక్తం కావాలని తెలిపారు. ప్రపంచ జనాభాలో 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న, మధ్య, తక్కువ ఆదాయ దేశాల్లోనే ఉన్నారు. ఈ దేశాలన్నింటికీ ఏటా10 కోట్ల యూనిట్ల రక్తం అందుబాటులో ఉంటోంది. అయితే, ఈ దేశాల్లోని బ్లడ్ బ్యాంకులకు ప్రపంచ జనాభాలో16 శాతమే ఉన్న అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఏటా 42 శాతం రక్తం అందుతోందని రీసెర్చర్లు పేర్కొన్నారు. మధ్య, అల్ప ఆదాయ దేశాల్లో అవసరమైనంత రక్తం అందుబాటులోకి తెచ్చేందుకు స్ట్రాటజిక్ ఇన్ వెస్ట్ మెంట్లు పెట్టాలని, బ్లడ్ మేనేజ్ మెంట్ సిస్టమ్స్, ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని రీసెర్చర్లు సూచించారు.