బీఎల్​వోలు రికార్డులు మేయింటెన్ చేయాలి

బీఎల్​వోలు రికార్డులు మేయింటెన్ చేయాలి
  •     85 ఏండ్లు నిండిన వారికి హోం ఓటింగ్​ సౌకర్యం
  •     హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్​

శాయంపేట, వెలుగు :  బీఎల్​వోలు ఓటర్లకు సంబంధించిన రికార్డులను మేయింటెన్ చేయాలని, ఆఫీసర్లు రికార్డులను తనిఖీ చేయాలని హనుమకొండ కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ సూచించారు. ఎంపీ ఎలక్షన్ల నేపథ్యంలో శుక్రవారం శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలను పరిశీలించారు. బీఎల్​వోలు డెత్, డుప్లికేట్, కొత్త ఓటర్లకు సంబంధించిన రికార్డులు మేయింటెన్​ చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. 

సూపర్​వైజర్లు బీఎల్​వోలకు ఎన్నికలకు సంబంధించి సమాచారం అందించాలన్నారు. 85 ఏండ్లు నిండి, బెడ్​రెస్ట్​లో, పూర్తి అంగవైకల్యం ఉండి పోలింగ్ స్టేషన్​కు రాని వారితో హోం ఓటింగ్​ వేయించాలన్నారు. ఇప్పటి వరకు కొత్తగా ఎంత మంది ఓటర్లను నమోదుచేశారో బీఎల్​వోలను, మోడల్ కండక్ట్ కు సంబంధించి గ్రామాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎంపీడీవోను అడిగి తెలుసుకున్నారు. కోడ్​ ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ఆఫీసర్లకు కలెక్టర్ సూచించారు. అనంతరం మైలారం గ్రామంలో మధ్యాహ్న భోజనం చేస్తున్న చిన్నారులతో కలెక్టర్​ మాట్లాడారు. క్లాస్​రూంలో చిన్నారులతో ఇంగ్లిష్​ పాఠాన్ని చదివించారు. కలెక్టర్​ వెంట తహసీల్దార్లు ఫణిచంద్ర, సుభాషిణి, ఏఎస్​వో, ఆర్​ఐ శరత్​కుమార్ పాల్గొన్నారు.