
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. ఆల్ ఇండియా అండ్ తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా.. పార్టీ అనుమతులు తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల వల్లే పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పారు.
ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకే బీజేపీలోకి
బోధన్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకత్వం లోపించిందని.. ప్రజల్ని మరింత చైతన్యవంతం చేసేందుకే బీజేపీలోకి వెళ్తున్నానని మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన నాయకులు విలాసవంతమైన జీవితం గడుపుతూ ప్రజా సేవను విస్మరించారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మోహన్ రెడ్డితోపాటు దాదాపు 100 మంది ప్రజా ప్రతినిధులు, సొసైటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మండల రైతు సమన్వయ కమిటీ చైర్మన్, మాజీ చైర్మన్ బీజేపీలో చేరేందుకు ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు దాదాపు 300 మంది రాజీనామా చేస్తారని మోహన్ రెడ్డి వెల్లడించారు.