కీవ్  సిటీ శివార్లలో 900 మృతదేహాలు 

కీవ్  సిటీ శివార్లలో 900 మృతదేహాలు 

     సిటీ శివార్లలో 900 మృతదేహాలు 
    వీధుల్లో ఎక్కడ పడితే  అక్కడ డెడ్ బాడీలు 
    ఉక్రెయిన్ సిటీలపై దాడులు పెంచిన రష్యా 
    మరియుపోల్​లో మొబైల్ క్రిమటోరియాల్లో సీక్రెట్​గా శవాల దహనం 

కీవ్/మాస్కో: ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరం చుట్టూ ప్రజల మృతదేహాలు గుట్టలుగుట్టలుగా బయటపడుతున్నాయి. వీధుల్లో ఎక్కడ చూసినా డెడ్ బాడీలు పడి ఉన్నాయి. ఒక్క కీవ్ సిటీ చుట్టుపక్కల్నే 900కు పైగా మృతదేహాలు దొరికాయని శనివారం ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. వీరిలో 95% మంది శరీరాలపై తుపాకీ తూటాల గుర్తులు ఉన్నాయన్నారు. రష్యన్ సోల్జర్లు కన్పించిన వాళ్లందరినీ కాల్చివేస్తూ నరమేధానికి పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. శిథిలాల కింద రోజూ శవాలు బయటపడుతున్నాయని, కొన్ని చోట్ల భారీ గుంతలు తవ్వి మృతదేహాలను పూడ్చేసిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయని తెలిపారు. కీవ్ కు సమీపంలోని బుచా టౌన్ లో మృతుల సంఖ్య 350కి చేరిందన్నారు. బుచా టౌన్ ఇప్పటికీ రష్యా కంట్రోల్ లోనే ఉందన్నారు. మరోవైపు యుద్ధం మొదలై 50 రోజులవుతున్నా ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండటం, నల్ల సముద్రంలో కీలకమైన నౌక మునిగిపోవడంతో కీవ్, లవీవ్, మరియుపోల్ సహా పలు సిటీలపై రష్యా శనివారం దాడులు తీవ్రం చేసింది. తమ భూభాగంపై ఉక్రెయిన్ దాడులు చేస్తున్నందున కీవ్ పైకి లాంగ్ రేంజ్ మిసైల్స్​ను ప్రయోగిస్తున్నామని రష్యా శుక్రవారమే హెచ్చరించింది. ఈశాన్య ఉక్రెయిన్​లోని ఖార్కివ్ సిటీలో ఇండ్లపై షెల్లింగ్ చేయడంతో ఏడుగురు పౌరులు చనిపోయారు. చనిపోయిన వాళ్లలో 7 నెలల చిన్నారి కూడా ఉన్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. 

బాంబుల మోతతో దద్దరిల్లిన కీవ్, లవీవ్

ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు పశ్చిమాన ఉన్న లవీవ్ సిటీ మళ్లీ బాంబు మోతలతో దద్దరిల్లాయి. ఈ రెండు సిటీలపై రష్యా శనివారం తెల్లవారుజామున బాంబుల వర్షం కురిపించిందని లోకల్ మీడియా వెల్లడించింది. కీవ్ శివార్లలోని డార్నిస్కీ జిల్లాలో భారీగా బాంబు పేలుళ్లు జరిగాయని కీవ్ సిటీ మేయర్ విటాలీ క్లిష్చెకో చెప్పారు. రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారని, బాధితులకు డాక్టర్లు చికిత్స చేస్తున్నారని తెలిపారు. ప్రజలంతా ఎయిర్ అలారాలను విస్మరించొద్దని సూచించారు. ఎక్కడి వాళ్లు అక్కడే సురక్షితంగా ఉండాలని, కీవ్ నుంచి వెళ్లిన వాళ్లు ఇప్పుడప్పుడే తిరిగి సిటీలోకి రావద్దని హెచ్చరించారు. 

పుతిన్ అణ్వాయుధాలు వాడొచ్చు: జెలెన్ స్కీ  
ఉక్రెయిన్​పై పుతిన్ అణ్వాయుధాలు ప్రయోగించొచ్చని, ప్రపంచ దేశాలన్నీ సన్నద్ధంగా ఉండాలని జెలెన్ స్కీ హెచ్చరించారు. ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలంటే పుతిన్​కు లెక్కలేదని, అందుకే ఆయన న్యూక్లియర్ లేదా కెమికల్ వెపన్స్​ను కూడా ప్రయోగించే అవకాశం ఉందన్నారు. ఇది తమకు మాత్రమే కాదని, మొత్తం ప్రపంచానికే ఆందోళనకరమని జెలెన్ స్కీ స్పష్టంచేశారు. రష్యా నుంచి ఇలాంటి దాడులు జరిగితే ఎదుర్కోవడానికి అన్ని దేశాలూ సిద్ధంగా ఉండాలన్నారు. రష్యాతో యుద్ధంలో ఇప్పటివరకు 3 వేల మంది ఉక్రెయిన్ సోల్జర్లు చనిపోయారని, 10 వేల మంది గాయపడ్డారని జెలెన్ స్కీ చెప్పారు.

బ్రిటన్ ప్రధాని జాన్సన్​పై రష్యా బ్యాన్ 

బ్రిటిష్ ప్రధాని బోరిస్​ జాన్సన్, ఆయన కేబినెట్​ మంత్రులు, బ్రిటన్​ పొలిటీషియన్లపై రష్యా బ్యాన్​ విధించింది. తమపై ఆంక్షలు విధించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రష్యన్​ ఫారిన్​ మినిస్టర్​ చెప్పారు. మాస్కో రిలీజ్​ చేసిన స్టాప్ లిస్ట్​లో మొత్తం 13 మంది బ్రిటిష్​ పొలిటీషియన్లు ఉన్నారు. ఇందులో భారత సంతతికి చెందిన యూకే చాన్స్​లర్ రిషి శునక్, హోంమంత్రి ప్రీతిపటేల్, అటార్నీ జనరల్​ సుయెల్ల బ్రవెర్​మన్​తో పాటు డిప్యూటీ పీఎం డొమినిక్​ రాబ్, విదేశాంగ మంత్రి లిజ్​ ట్రస్, రక్షణ మంత్రి బెన్​ వాలెస్​ తదితరులు ఉన్నారు. ఇదే మాదిరిగా మార్చిలో అమెరికా ప్రెసిడెంట్ బిడెన్​పై కూడా రష్యా బ్యాన్​ విధించింది.