గంగలో కరోనా డెడ్ బాడీలు 

గంగలో కరోనా డెడ్ బాడీలు 


పాట్నా:  గంగా నదిలో వరుసగా మృతదేహాలు తేలుతూ ఒడ్డుకు కొట్టుకొస్తుండటంతో బీహార్ లోని చౌసా, బక్సర్ జిల్లాల్లో కలకలం రేగింది. యూపీ నుంచే అవి కొట్టుకొస్తున్నాయని కొందరు.. గంగా తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలే డెడ్ బాడీలను విసిరేస్తున్నారని మరికొందరు చెప్తున్నారు. కరోనా కారణంగా అంత్యక్రియల ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో పేద కుటుంబాల వాళ్లు ఇలా డెడ్ బాడీలను నదిలో పారేస్తున్నారని కొందరు అంటున్నారు. సోమవారం ఉదయం చౌసా జిల్లాలోని గంగా నదిలో 30 మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే చౌసా జిల్లా మహదేవ ఘాట్ లో దాదాపు 100 నుంచి 150 డెడ్ బాడీలు కొట్టుకు వచ్చాయని లోకల్ వ్యక్తి ఒకరు చెప్పారు. ఉదయం నుంచి తాను 35 డెడ్ బాడీల వరకూ చూశానని, అవి కరోనా పేషెంట్లవేనని మరో వ్యక్తి వెల్లడించారు. వాటిలో సగం కాలిపోయిన మృతదేహాలు కూడా ఉన్నాయన్నారు. కరోనా పేషెంట్ల డెడ్ బాడీలు కొట్టుకు వస్తుండటంతో నదీ తీరంలోని గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని బక్సర్ జిల్లా మెజిస్ట్రేట్ పోలీసులను ఆదేశించారు. అవి లోకల్ డెడ్ బాడీలు కావని, రెండ్రోజులుగా నీళ్లలో కొట్టుకొచ్చాయని భావిస్తున్నారు. సోమవారం కొన్ని డెడ్ బాడీలను నది నుంచి వెలికి తీసి, దహనం చేశామని పోలీసులు తెలిపారు.