‘బాడీ డొనేషన్’సామాజిక బాధ్యత

‘బాడీ డొనేషన్’సామాజిక బాధ్యత

సమాజంలో మనిషిచేసే  దానాల్లో అన్నదానం, విద్యాదానం, నేత్రదానం, రక్తదానం వంటివి  ఆపన్నులకు సంతృప్తినిచ్చేవే.  అయితే, అవయవదానం (బ్రెయిన్ డెడ్ తర్వాత), దేహదానం (చనిపోయిన అనంతరం) బాధితుల జీవితాలను  నిలబెట్టేవి.  మనిషి  మరణానంతరం చేసే ‘బాడీ డొనేషన్’ ఎంతో అత్యున్నతమైన సామాజిక బాధ్యత కలిగినది. చనిపోయాక మట్టిలో దేహం కలిసిపోవడం కంటే  పదుల సంఖ్యలో  డాక్టర్లుగా తయారయ్యేవారు  వైద్య పరిజ్ఞానం సంపాదించుకునేందుకు ఉపయోగపడాలని ఈ  నిర్ణయం తీసుకుంటారు.  

అయితే,  సమాజంలో ఎన్నో అపోహలు నెలకొని ఉన్నందున చనిపోయాక శరీరదానం చేసేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.   తెలంగాణలో ప్రతి పదిలక్షల మంది మృతుల్లో ముగ్గురు మాత్రమే శరీరదానానికి ముందుకొస్తున్నారు.  ఇక 2024 జనవరి నాటికి దేశవ్యాప్తంగా శరీరదానం చేసినవారు 17,061 మంది మాత్రమేనని ఎంసీఐ లెక్కల ద్వారా తెలుస్తోంది. 

‘కెడావర్ల’ లెక్కలు చెప్పాలంటూ.. 

దేశంలోని  అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఇకముందు  తమ వార్షిక డిక్లరేషన్​లో  కెడావర్ల (శవాల) లెక్కలను  తప్పనిసరిగా  తెలపాలంటూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) పరిధిలోని అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు(యూజీఎంఈబీ)  కొద్దిరోజుల కింద ఆదేశించింది. ఇలా ఎందుకంటే.. ఎంబీబీఎస్  స్టూడెంట్స్ కోర్సులో భాగంగా అనాటమీ సబ్జెక్ట్  క్లాసుల్లో డిసెక్షన్ (డెడ్‌బాడీని కోసి చూడడం)  చేయాల్సి ఉంటుంది. 

 తద్వారా మానవ శరీరం నిర్మాణం, అవయవాల పనితీరు, లోపాలు వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండి ప్రాక్టికల్‌ నాలెడ్జ్​ సంపాదిస్తారు.   ప్రతి 12  నుంచి 20 మంది మెడికల్ స్టూడెంట్స్ కు ల్యాబ్​లో ఒక  డెడ్​బాడీ అందుబాటులో ఉండాలి. అయితే, శరీరదానాలు సరిగా లేకపోవడంతో రాష్ట్రంలోని చాలా మెడికల్ కాలేజీల్లో కెడావర్ల కొరత వేధిస్తోంది. వాస్తవానికి దేహదానం చేసేవారు తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. 

రబ్బరు బొమ్మలు, డిజిటల్ క్లాసుల ద్వారా..

మెడికల్ స్టూడెంట్స్​కు  ఫస్ట్ ఇయర్ ఎంతో ప్రాధాన్యం కలిగినది.  అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్ సబ్జెక్టుల ద్వారా మనిషి శరీర నిర్మాణం ఎలా ఉంటుంది? ఎలా పని చేస్తుందనేది కెడావర్లను డిసెక్షన్‌ చేయడం ద్వారానే నేర్చుకుంటారు. ఇది రబ్బరు బొమ్మలు, డిజిటల్ క్లాసుల ద్వారా నేర్చుకోవడం  ఎన్‌ఎంసీ రూల్స్ కు  విరుద్ధం.  కొన్ని  ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఎన్‌ఎంసీ రూల్స్​ను పాటించడం లేదని వైద్య నిపుణుల ద్వారా తెలుస్తోంది.

 ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మార్చురీల్లో ఉండే అన్‌క్లైమ్డ్‌ మృతదేహాలను వైద్య పరిశోధనల నిమిత్తం ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ఇచ్చేందుకు గతంలో ఒక జీవోను జారీ చేసింది. ఒక్కో డెడ్ బాడీకి రూ.60వేల చొప్పున చెల్లించాలి. అంత ఖర్చు భరించలేక  కొన్ని ప్రైవేట్ కాలేజీలు శరీర నిర్మాణాలను పోలి ఉండే రబ్బరు బొమ్మలను తీసుకొచ్చి లేదంటే డిజిటల్ పద్ధతిలోనూ  స్టూడెంట్స్​కు  అనాటమీ క్లాసులు బోధిస్తున్నట్టు  మెడికల్ ఎక్స్​పర్ట్స్ పేర్కొంటున్నారు. .

కమ్యూనిస్టు కుటుంబాలదే ముందంజ

చనిపోయాక దేహం మనతోనే అంతరించిపోతుంది. అదే సామాజిక బాధ్యతను గుర్తిస్తూ  డొనేట్ చేస్తే  పేరు శాశ్వతంగా నిలుస్తుంది. ఇలాంటి అత్యున్నత దాతృత్వ గుణం కలిగి ఉంటే  చరిత్ర కూడా గుర్తిస్తుంది. ఇలా చేసేవారిలో కమ్యూనిస్టు కుటుంబాలు, నేతలు ముందుంటారనేది తెలిసిందే.  ఎంతోమంది కమ్యూనిస్టు నేతలు తాము చనిపోయిన తర్వాత మృతదేహాలను  ఆస్పత్రులకు దానంగా ఇచ్చారు. ఇందుకు ఉదాహరణగా  గతేడాది చనిపోయిన సీతారాం ఏచూరి, సాయిబాబాను  చూడవచ్చు.  వైద్య విద్యార్థుల బోధన, పరిశోధనల కోసం ఉపయోగపడే సంప్రదాయాన్ని కమ్యూనిస్టులు కొనసాగిస్తున్నారు. 

అయితే, శరీరాన్ని దానం చేయాలని వ్యక్తి బతికి ఉండగానే నిర్ణయం తీసుకుంటే.. మెడికల్ కాలేజీకిగానీ,  ఎన్జీవో సంస్థలకైనా ఆమోదపత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అలాకాదంటే అతని మరణానంతరం కుటుంబ సభ్యులు కూడా ఇవ్వొచ్చు.   వైద్య సిబ్బంది లేదా ఎన్జీవో ఆ శరీరాలను తీసుకెళ్లవచ్చు. కానీ, ఇందుకు కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి అనే ప్రభుత్వ నిబంధన లేకపోలేదు. ఒకవేళ శరీరదాతలు కోరితే, కొంతకాలం ప్రాక్టికల్ వర్క్ చేసిన తర్వాత కూడా ఆయా శరీరాలను కుటుంబ సభ్యులకు అప్పగించే వీలు కూడా ఉంటుంది.  

-- వేల్పుల సురేష్,సీనియర్ జర్నలిస్ట్​-