నవీన్ కుటుంబాన్నిఆదుకుంటామన్న సీఎం బొమ్మై

నవీన్ కుటుంబాన్నిఆదుకుంటామన్న సీఎం బొమ్మై

ఉక్రెయిన్ లో రష్యా జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్పా జ్ఞానగౌడర్ మృతదేహం బెంగళూరుకు చేరుకుంది.ఈనెల 1వ తేదీన రష్యా సైనికులు జరిపిన కాల్పుల్లో నవీన్ చనిపోయాడు. ఆయన మృతదేహం ఇవాళ తెల్లవారుజామున ఉదయం 3 గంటల 30 నిమిషాలకు బెంగళూరుకు చేరుకుంది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, అధికారులు, మృతుడి కుటుంబ సభ్యులు ఎయిర్ పోర్టుకు చేరుకుని నవీన్ భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి నేరుగా నవీన్ మృతదేహాన్ని స్వగ్రామం హవేరి జిల్లాకు పంపించారు. చెట్టంత కొడుకు తమ కళ్ల ముందే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో బోరున విలపించారు కుటుంబ సభ్యులు. తన కొడుకు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కృషి చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ వార్ లో ఎంతో భవిష్యత్తు ఉన్న నవీన్  బలికావడం దారుణమన్నారు సీఎం బసవరాజ్ బొమ్మై. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల చెక్కును అందజేశారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లాడు నవీన్. ఆహారం కోసం క్యూలో నిలబడి ఉండగా.. రష్యా సైన్యం జరిపిన కాల్పుల్లో నవీన్ మరణించాడు.

మరిన్ని వార్తల కోసం

 

వయసు మీద పడిందని కలలు కనడం మానొద్దు

ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవాలె