ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవాలె

ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవాలె
  • పనులు చేయని వారిని ప్రజలే తొలగించొచ్చు: కేజ్రీవాల్​
  •  ఆప్​ ఎమ్మెల్యేలతో వర్చువల్​గా మాట్లాడిన పార్టీ నేషనల్​ కన్వీనర్​
  •  ఎమ్మెల్యేలు ప్రతి టౌన్​లో ఆఫీసులు తెరవాలని సూచన 

చండీగఢ్​: పంజాబ్​ కేబినెట్​లోని ప్రతి మంత్రికీ సీఎం భగవంత్​ మన్​ లక్ష్యాలు పెట్టారని, ఆ టార్గెట్​ అందుకోని మంత్రులను కేబినెట్​ నుంచి తొలగించాలని డిమాండ్​ చేసే హక్కు ప్రజలకు ఉంటుందని ఆమ్​ ఆద్మీ పార్టీ (ఆప్​) చీఫ్​, ఢిల్లీ సీఎం అర్వింద్​ కేజ్రీవాల్​ చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే భగవంత్​ మన్​ ఎన్నో పనులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఆదివారం మొహాలీలో ఎమ్మెల్యేలతో నిర్వహించిన వర్చువల్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. పాత మంత్రులకు భద్రతను తొలగించి ప్రజలకు భద్రతను పెంచారని గుర్తు చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చారని చెప్పారు. అవినీతిని అంతమొందించేందుకు మన్​ హెల్ప్​లైన్​ పెట్టారని, దీంతో ఢిల్లీలోనూ అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు చండీగఢ్​లోనే ఉండిపోవద్దని, గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. పంజాబ్​ ప్రజలు వజ్రాలను ఎన్నుకున్నారని, మన్​ నాయకత్వంలో 92 మంది ఎమ్మెల్యేల టీం పనిచేయాలని చెప్పారు. మన్​కు తాను కేవలం అన్న లాంటివాడినేనన్నారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని ప్రతి టౌన్​లోనూ ఆఫీసును ఓపెన్​చేయాలని, రోజూ 18 గంటల పాటు పనిచేయాలని సూచించారు. ఢిల్లీ నుంచే తాను అన్నీ చూస్తుంటానని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో ఎప్పటికప్పుడు ప్రజలను అడిగి తెలుసుకుంటామని ఆయన చెప్పారు. ఎన్నికలకు ముందు ప్రజలతో సర్వే చేయించామని, 22 మంది అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, దీంతో వారిని కాదని వేరే వారికి టికెట్లు ఇచ్చామని కేజ్రీవాల్​ గుర్తు చేశారు.