రోజుకు కిలో చొప్పున ఆల్ఫ్రాజోలం తయారీ ..ఆరుసార్లు ఫెయిల్‌‌.. ఏడోసారి సక్సెస్‌‌

రోజుకు కిలో చొప్పున ఆల్ఫ్రాజోలం తయారీ ..ఆరుసార్లు ఫెయిల్‌‌.. ఏడోసారి సక్సెస్‌‌
  • స్కూల్‌‌లో తయారీ.. స్కూటీపై సరఫరా
  • మేధాస్కూల్‌‌ కరస్పాండెంట్‌‌ రిమాండ్‌‌ రిపోర్టులో కీలక విషయాలు

హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ బోయిన్​పల్లిలోని మేధా స్కూల్లో ఆల్ఫ్రాజోలం తయారీ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆల్ఫ్రాజోలం తయారు చేసేందుకు మేధా స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాశ్ అనేకమార్లు ప్రయత్నించినట్లు ఈగల్ దర్యాప్తులో బయటపడింది. ఈ కేసులో జయప్రకాశ్‌‌గౌడ్‌‌తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన ఈగల్‌‌ టీం.. కోర్టులో హాజరుపర్చి 14 రోజుల రిమాండ్​కు తరలించిన విషయం తెలిసిందే. 

రిమాండ్‌‌ రిపోర్టులోని అంశాలు విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జయప్రకాశ్‌‌గౌడ్‌‌ సులువుగా డబ్బు సంపాదనే లక్ష్యంగా ఈ మత్తు దందాలోకి దిగాడు. తొలుత ఓల్డ్‌‌ బోయినపల్లిలో ఒక భవనాన్ని అద్దెకు తీసుకుని  మేధా హైస్కూల్‌‌ ప్రారంభించాడు. ఆ తర్వాత క్రమంలో గురువారెడ్డి అనే ఆల్ఫ్రాజోలం తయారీదారుడి నుంచి ఫార్ములా కొనుక్కున్నాడు. తన స్కూల్​లోనే మత్తుపదార్థాలు తయారు చేస్తే.. ఎవరికి తెలియకుండా ఉంటుందని మాస్టర్‌‌ ప్లాన్‌‌ వేశాడు.

రాత్రి సమయాల్లో తయారీ

అనుకున్నట్టుగానే  అవసరమైన కెమికల్స్‌‌, ఇతర పదార్థాలను రాత్రి సమయాల్లో తెచ్చేవాడు. ఉదయం పాఠశాల నడిచే సమయంలో ఆ రెండు గదులకు తాళం వేసి ఉంచేవాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అంతా వెళ్లిన తర్వాత ఆల్ఫ్రాజోలం తయారీ మొదలు పెట్టేవాడు. 

ఇలా ఆరుసార్లు ఫెయిల్‌‌ అయినా.. ఏడో సారి సక్సె్‌‌స్‌‌ సాధించానని, తాను తయారుచేసిన మత్తుమందుతో కిక్కు రావడంతో వినియోగారులు హ్యాపీగా ఫీలయ్యారని విచారణలో భాగంగా జయప్రకాశ్‌‌గౌడ్‌‌ చెప్పినట్టు తెలిసింది. రోజుకు కిలో చొప్పున ఆల్ఫ్రాజోలం తయారు చేసే జయ ప్రకాశ్‌‌గౌడ్‌‌  తయారుచేసిన మొత్తం స్కూటీపై తీసుకువెళ్లి సప్లై చేసేవాడు. 

ఇలా అయితే ఎవరూ తనను అనుమానించరన్న ధీమాతోనే ఇలా చేసేవాడని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం దాడి చేసిన ఈగల్‌‌ అధికారులు జయప్రకాశ్‌‌గౌడ్‌‌ అతడి వద్ద నుంచి 3.5 కిలోలు,  పాఠశాలలో తనిఖీలో మరో  4.3 కిలోల ఆల్ఫ్రాజోలం, రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జయప్రకాశ్ ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మంగళవారం కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది.