చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్.. కేన్స్లో జాన్వీ కపూర్తో మెరిసిన ఇషాన్.. ఏంటి ఇతని స్పెషల్..!

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్..  కేన్స్లో జాన్వీ కపూర్తో మెరిసిన ఇషాన్.. ఏంటి ఇతని స్పెషల్..!

ఇషాన్ ఖట్టర్.. ఈ పేరు తెలుగు ఆడియెన్స్​కి కొత్త అయి ఉండొచ్చు. కానీ, భాషాంతరాలు లేకుండా సినిమాలు చూసే మూవీ లవర్స్​కు మాత్రం పాతదే. ఇంతకీ ఎవరితను? అంటే.. చైల్డ్ ఆర్టిస్ట్​గా మొదలుపెట్టి, అసిస్టెంట్​ డైరెక్టర్​గా వర్క్ నేర్చు కుంటూనే సినిమాల్లో నటించాడు. ‘దఢక్​’ సినిమాతో ఒక్కసారిగా లైమ్​ లైట్​లోకి వచ్చాడు ఈ యంగ్​ హీరో. రీసెంట్​గా ‘రాయల్స్’ అనే సిరీస్​తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం జరుగుతోన్న కేన్స్​ వేదికపైన జాన్వీకపూర్​తో కలిసి కనిపించాడు ఇషాన్​.

ఇషాన్​ ముంబైలో పుట్టాడు. అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. డాన్స్​, వర్కవుట్​, ట్రావెలింగ్ తన హాబీలు. డాన్స్​లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇషాన్ తల్లి నీలిమ అజీమ్.. సీరియల్ నటి. తండ్రి రాజేశ్ ఖట్టర్ ఫిల్మ్ యాక్టర్. ఇషాన్​ షాహిద్​ కపూర్​కు వరుసకు తమ్ముడు అవుతాడు. సినిమా షూటింగ్స్ ఉన్నప్పుడల్లా అన్నతో కలిసి సెట్​కు వెళ్లడం ఇషాన్​కి అలవాటు. అలాగే ఒకసారి హాలీడేస్​లో షూటింగ్​ స్పాట్​కి వెళ్లాడు. 

అది 2005.. ‘వాహ్! లైఫ్ హో తో ఐసీ’ అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో షాహిద్​ కపూర్​ హీరో. సెట్​లో చాలామంది పిల్లలు కనిపించారు. వాళ్లను చూడగానే తనకూ నటించాలని అనిపించిదట. అంతే.. వెళ్లి వాళ్ల అన్నను అడగ్గానే డైరెక్టర్​ చెప్పి కాసేపు కూర్చోబెట్టారు. అలా అక్కడున్న పిల్లలతో కలిసి సరదాగా నటించేశాడు ఇషాన్​. అదే తన ఫస్ట్​ మూవీ. ఆ తర్వాత 2016లో ‘ఉడ్తా పంజాబ్​’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్​గా పనిచేశాడు. నటించాడు కూడా. అలా రెండు ప్రాజెక్ట్​లు చేశాక మళ్లీ యాక్టింగ్​ కెరీర్​నే కంటిన్యూ చేశాడు. 

దఢక్​తో మొదలు 

2018లో ఒక్కసారిగా తన పేరు బాలీవుడ్​లో మారుమోగిపోయింది. ఇతర ఇండస్ట్రీ ఆడియెన్స్​ కూడా అతని నటనకు బాగా కనెక్ట్ అయ్యారు. అదే ‘దఢక్​’ సినిమా. అందులో జాన్వీ కపూర్​తో కలిసి నటించాడు. ఆ సినిమా ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఖాలీ పీలీ, డోంట్​ లుక్​ అప్, ఫోన్ భూత్, ఫర్సాట్, పిప్పా వంటి సినిమాల్లో నటించాడు. సినిమాలతోపాటు ‘ఎ సూటబుల్ బాయ్’, ‘ది పర్ఫెక్ట్ కపుల్’ అనే సిరీస్​లలో నటించాడు. 

ప్రస్తుతం ‘రాయల్స్’ అనే సిరీస్​ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఇప్పటికే తను చేసిన ప్రాజెక్ట్స్​కి గాను బెస్ట్ మేల్ డెబ్యూ, బెస్ట్ యాక్టర్​గా నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్నాడు. హాలీవుడ్​లోనూ ఇషాన్​ నటించాడు. అక్కడ నటించడం గురించి ఒక ఇంటర్వ్యూలో ‘‘హాలీవుడ్ ప్రొడక్షన్​లో చేయడం చాలా డిఫరెంట్ ఎక్స్​పీరియెన్స్. కల్చరల్ డిఫరెన్స్​లు ఎక్కువగా ఉంటాయి. మేం అంతా చేసేది ఒకటే పని అయినా కొన్ని విషయాల్లో తేడా ఉంటుంది. అక్కడ ప్రొటోకాల్స్ ఎక్కువ. అక్కడి విధానాలు, వైఖరి వేరుగా ఉంటాయి” అని చెప్పాడు. 

రీసెంట్​గా ఇషాన్‌‌, జాన్వీ కపూర్ నటించిన మరో ప్రాజెక్ట్​ ‘హోం బౌండ్’ కేన్స్​లో షో వేశారు. దానికి అక్కడున్నవాళ్లంతా స్టాండ్ ఒవేషన్ ఇచ్చిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేన్స్​ వేదికపై కూడా ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్‌‌ కలిసి నడిచారు. ఈ సినిమా డైరెక్టర్​ నీరజ్ గేవన్. దీని గురించి ఇషాన్ మాట్లాడుతూ​ ‘డైరెక్టర్​ చాలా ఆలోచనాపరుడు. సెన్సిటివ్​, మంచి మనసున్న వ్యక్తి. అదే తను చెప్పే కథల్లోనూ కనిపిస్తుంది. 

అలాంటి సినిమాలు వేరేవాళ్లు తీయలేరు” అని ప్రశంసించాడు. తన ఇన్​స్టా పోస్ట్​లో ‘నేను నీరజ్ మొదటి సినిమా మసాన్​ చూశాను. చాలా నచ్చింది. సెకండ్ ప్రాజెక్ట్​కి నా దగ్గరకు రాగానే నేను చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను. నాకు కథ చాలా నచ్చింది. కల్చర్, సాయం చేసే గుణం నచ్చాయి. ఇండియన్​ సినిమాకు గుర్తింపు తెచ్చే సినిమా ఇచ్చాడు. ఈ ఏడాది కేన్స్​లో అఫీషియల్​గా సెలక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది” అని రాశాడు.

అమ్మ నా మొదటి ప్రేక్షకురాలు

ఇంతకుముందు ఒక సినిమా చేసేటప్పుడు మరొకటి చేసేవాడిని కాదు. ఇప్పుడు మారాను.. ఒకేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయగలనన్న నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఇది నా పని. నాకు పని దొరికినప్పుడు చేయాలి కదా. అలాగని హడావిడిగా నాలుగైదు ప్రాజెక్ట్స్ ఒకేసారి చేయాల్సిన అవసరం కూడా లేదు. నాకు నచ్చిన కథలు రావాలి. అవి వచ్చినప్పుడు వెనుకాడకుండా చేయగలననే కాన్ఫిడెన్స్ అయితే ఇప్పుడు వచ్చింది.  మా అమ్మ నా మొదటి ప్రేక్షకురాలు. తన రియాక్షన్, రివ్యూ నాకు హెల్ప్ అవుతాయి. ఆమె కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి ఒక కొడుకులానే కాకుండా, నటిగా ఆమె చెప్పే విషయాలకు నేను విలువనిస్తాను. 

ఆడియెన్స్​కి నచ్చేలా తీశామా? లేదా? 

ఏదైనా ఒక ప్రాజెక్ట్ బాగా తీయడమే కాదు.. దాన్ని కరెక్ట్​ టైంలో రిలీజ్ చేయడం కూడా ముఖ్యమే. కాబట్టి ఆ టైంలో కొంచెం టెన్షన్​గా అనిపిస్తుంది. ఎందుకంటే అదే టైంకి వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు పెద్ద స్టార్‌‌‌‌ సినిమాలు కూడా వస్తుంటాయి. అయినప్పటికీ మన సినిమా చూసే ఆడియెన్స్​ని మనం ఆకట్టుకోవాలి. థియేటర్​ వరకు తీసుకొచ్చి కూర్చొబెట్టగలగాలి. లేకపోతే అవతలి వాళ్ల సినిమాతో పోటీ పడే చాన్స్​ లేదు. 

పైగా నేను నటుడిగా ఇంకా చిన్న స్థాయిలోనే ఉన్నాను. ఇంకా చూడాల్సింది.. చేయాల్సింది చాలా ఉంది. నా ఎక్స్​పీరియెన్స్ కూడా మిగతావాళ్లతో పోలిస్తే తక్కువే. ఇన్ని విషయాలు మన ముందు ఉన్నప్పుడు మన సినిమా టైంలో ఇంకొకరు పోటీ అవుతారనే ఆలోచనే రాకూడదు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఇది చాలా కామన్. ఇవన్నీ నేర్చుకుంటూ ఉండాలి. ఇక సక్సెస్, ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండదు. రిజల్ట్ అనేది చూసే ఆడియెన్స్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి మనం సినిమా ఆడియెన్స్​కి నచ్చేలా తీశామా? లేదా? అన్నది మాత్రమే ఆలోచిస్తే చాలు అనుకుంటా. 

అది ఆడియెన్స్ డిసైడ్ చేయాలి

ఒక బలమైన కథ తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ కథను నమ్మి సినిమా చేస్తాం. కానీ, దాని రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఊహించలేం. కాబట్టి మన కథను ఎక్కువ మందికి రీచ్​ అయ్యేలా చేయాలనే ఆలోచనతో ఉంటాం. అలా ఎక్కువమందికి రీచ్​ అయితే సినిమా సక్సెస్​ అయినట్టే. కాకపోతే లైఫ్ అనేది మనం అనుకున్నట్టు ఉండదు కదా. మనం వెళ్లే దారిలో ఎత్తుపల్లాలు సహజం. సక్సెస్​ లేదా ఫెయిల్.. రిజల్ట్ ఏదైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు సాగాలి. 

ప్రతిసారీ మంచి ఉద్దేశంతో ఎంతో ఫోకస్​ చేస్తే అంతకంటే మెరుగ్గా చేయగలం అని నేను నమ్ముతా. అంతేకాదు.. నా ఫిల్మ్ చాయిస్​లే నన్ను బెటర్ చేస్తాయి అనే ఆలోచన ఎప్పుడూ లేదు. అది ఆడియెన్స్ డిసైడ్ చేయాలి. కానీ, నేను ప్రతిసారీ ఎక్కడ వదిలేశానో అక్కడే మళ్లీ ఎదగాలని ప్రయత్నిస్తాను. 

ఎక్కువ పనిచేయాలి

ప్రస్తుతం నేను నేర్చుకున్నపాఠం ఏంటంటే నాతో నేను నిజాయితీగా ఉండడం. ముందుకు వెళ్లే కొద్దీ అలా ఉండడం మరింత అవసరం. అన్నింటికన్నా మించి నేను దేని గురించి ఎక్కువ ఆలోచించకూడదని నేర్చుకున్నా. తక్కువ ఆలోచించాలి. ఎక్కువ పనిచేయాలి అని తెలుసుకున్నా. సక్సెస్, ఫెయిల్, క్యారెక్టర్​ ఆర్టిస్ట్, లీడ్​ యాక్టర్​.. ఏదో ఒకరకంగా సినిమాల్లో ఉండడం నా ఉద్దేశం కాదు. మనం ఏది చేసినా అది ఎక్స్​లెంట్​ అనే గుర్తింపు రావాలి. అలాంటి కాంప్లిమెంట్స్ రావడానికి కాస్త టైం పట్టొచ్చు. మున్ముందు నేను దానికే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నా. అది మనం సరైన టైంలో సరైన్ ప్లేస్​లో ఉండడం కోసం కాదు. మనం చేసే వర్క్​, దాన్నుంచి ఏం సంపాదిస్తున్నాం అనే దానిమీద ఆధారపడి ఉంటుంది.

కామెడీ అంటే...

గ్లామర్, డ్రామాతోపాటు మానవత్వం వంటి ఎలిమెంట్స్ కూడా కలిపి అన్నీ ఒకే కథలో చూపించడం అరుదుగా జరుగుతుంది. అలాంటి ఒక ప్రాజెక్ట్​ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సవాలుగా ఉంటుంది. ఈ ‘రాయల్స్’ సిరీస్​ అలాంటిదే. ఒక యాక్టర్​గా నాకు కూడా ఇన్ని ఎలిమెంట్స్ ఎక్స్​ప్లోర్ చేయడం చాలా నచ్చింది. ఈ ప్రాజెక్ట్​లో కెమెరా ముందు, వెనక పనిచేసిన వాళ్లతో మంచి బాండింగ్ ఏర్పడింది. ఇందులో కామెడీ ఎక్కువ ఉంటుంది. అయితే నా ప్రకారం కామెడీ అంటే ప్రతిసారీ ఒకరు జోక్​ వేయడం కాదు.. కొన్నిసార్లు అవతలి వ్యక్తి దానికి ఎలా రియాక్ట్ అయ్యారు? అనేదానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. 

అతని రియాక్షన్స్​ నవ్వు తెప్పించేలా ఉండాలి. అప్పుడే కామెడీ పండుతుంది. అలాంటి చిన్న చిన్న విషయాలను ఎవరూ కొరియోగ్రఫీ చేయలేరు. అది ఆటోమేటిక్​గా యాక్టర్​ ఇంప్రూవ్ చేయాలి. అది క్లిక్ అవుతుందా? లేదా అనేది కూడా చూసుకోవాలి. ఈ సిరీస్​కి సంబంధించి క్రెడిట్ మొత్తం డైరెక్టర్స్​కే ఇవ్వాలి. ప్రియాంక, నుపుర్ కలిసి సిరీస్​ తెరకెక్కించారు. ఇద్దరూ కలిసి ఈ ప్రాజెక్ట్​ని బాగా హ్యాండిల్ చేశారు. ఏ టైంలో ఏం కావాలి అనేది వాళ్లకు బాగా తెలుసు. కాబట్టి మా జాబ్ చాలా ఈజీ అయిపోయింది.