
బాలీవుడ్ స్టార్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న ఆమె ఊహించని షాక్ ఇచ్చింది. ప్రముఖ ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రధాన నిందితుడిగా ఉన్న రూ.215 కోట్ల దోపిడీ కేసులో ఆమె కూడా భాగస్వామి అని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఆరోపించింది. తనపై ఉన్న ఈ కేసును రద్దు చేయాలంటూ జాక్వెలిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఆమె పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
సుప్రీం కోర్టులో షాక్..
ఈ కేసులో జాక్వెలిన్ మొదటి నుంచీ తాను అమాయకురాలిని అని, సుకేశ్ క్రిమినల్ నేపథ్యం గురించి తనకు ఏమాత్రం తెలియదని వాదిస్తున్నారు. కానీ, ఈడీ వర్గాలు మాత్రం జాక్వెలిన్‌కు సుకేశ్ నేరాల గురించి ముందే తెలుసని, అయినప్పటికీ అతనితో సాన్నిహిత్యాన్ని కొనసాగించారని వాదించింది. మోసపూరిత లావాదేవీల నుంచి లబ్ధి పొందినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.
ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు
సుకేశ్ చంద్రశేఖర్ తన మోసపూరిత కార్యకలాపాల ద్వారా సంపాదించిన డబ్బుతో జాక్వెలిన్‌కు, ఆమె కుటుంబ సభ్యులకు ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. దాదాపు రూ.10 కోట్ల విలువైన బహుమతులు వీరు అందుకున్నారని ఈడీ ఆరోపించింది. వీటిలో అత్యంత ఖరీదైన డిజైనర్ బ్యాగులు, జిమ్ సూట్లు, వజ్రాల చెవిపోగులు, బ్రాస్‌లెట్లు, ఖరీదైన వాహనం మిని కూపర్ వంటివి ఉన్నాయి. సుకేశ్ బహుమతులు మాత్రమే కాకుండా, జాక్వెలిన్‌కు విదేశాల్లో ఆస్తి కొనుగోలుకు కూడా ఆర్థిక సహాయం చేశారని ఈడీ విచారణలో తేలింది.
ఎదురుదెబ్బలు, భవిష్యత్ కార్యాచరణ
గతంలో కూడా ఈ కేసును కొట్టివేయాలని జాక్వెలిన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పట్లో ఢిల్లీ హైకోర్టు కూడా ఆమె పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే తీర్పు ఇవ్వడంతో జాక్వెలిన్‌కు నిరాశ తప్పలేదు. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో, ఈ కేసు విచారణ ఇప్పుడు కింది కోర్టులో కొనసాగనుంది. ఒకవేళ ఈడీ ఆరోపణలు నిజమని కోర్టులో నిరూపితమైతే, జాక్వెలిన్ కఠిన శిక్షను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ కేసు బాలీవుడ్‌లో సంచలనం సృష్టించగా, ఆమె అభిమానులు, సినీ వర్గాలు కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వ్యవహారం ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.