బాలీవుడ్‌లో విషాదం.. నటి సులోచన లట్కర్ కన్నుమూత

బాలీవుడ్‌లో విషాదం.. నటి సులోచన లట్కర్ కన్నుమూత

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. తన అధ్బుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ప్రముఖ నటి సులోచన లట్కర్(sulochana latkar) అనారోగ్యంతో కన్నుమూశారు. 94 ఏండ్ల వయసున్న సులోచన.. గత కొంతకాలంగా వృద్ధాప్య  సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జూన్ 3 నుంచి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. వెంటనే ఆమెను హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే ఆరోగ్యం విషమించడంతో జూన్ 4 ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. 

జూలై 30, 1928న కర్నాటకలోని బెల్గాం జిల్లా ఖడక్లారత్ లో జన్మించిన సులోచన లట్కర్.. 1943లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మరాఠీ, హిందీలో కలిపి 300 లకు పైగా సినిమాల్లో నటించారు. కటీపతంగ్, దిల్ దేకో దేఖో, గోరా ఔర్ కాలా.. వంటి ఎన్నో ఎవర్ గ్రీన్ మూవీస్ ఈ లిస్టులో ఉన్నాయి. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా మరాఠీ సినిమాలు చేసిన ఆమె.. తర్వాత హిందీ చిత్రసీమలోకి అడుగు పెట్టింది. 

ఈ సుదీర్ఘ ప్రయాణంలో సులోచన ప్రతిష్టాత్మక అవార్డులు కూడా అందుకుంది. సినిమా పరిశ్రమకు ఆమె చేసిన సేవలకు గాను.. 1999లో పద్మశ్రీ అవార్డు దక్కింది. 2009లో  'మహారాష్ట్ర భూషణ్' అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును కూడా అందుకుంది సులోచన. ఇక సులోచన లట్కర్ మృతి పట్ల  ప్రధాని మోదీతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.