బిగ్ బి.. దశాబ్దాల పాటు బాలీవుడ్‌ని శాసించిన బాద్‌షా

బిగ్ బి.. దశాబ్దాల పాటు బాలీవుడ్‌ని శాసించిన బాద్‌షా

అవకాశం ఇవ్వమని అడిగితే హీరో అయ్యే ఫేసేనా అన్నారు. పొడవుగా ఉంటే సరిపోద్దా నీకంత సీన్ లేదు పొమ్మన్నారు. స్టూడియోలోకి అడుగు పెట్టనివ్వమన్నారు. కెమెరా ముందు నిలబడే అర్హత నీకు ఏమాత్రం లేదన్నారు. కానీ ఏం జరిగింది? నవ్విన నాపచేనే పండింది. కాలచక్రం గిర్రున తిరిగింది. నో అనే మాటని ఎస్‌ అనే మాట రీప్లేస్ చేసింది. హీరో అంటే అతనే. అందమంటే అతనిదే. ఎత్తయిన ఆ రూపం అమోఘం. హుందాయైన ఆహార్యం అద్భుతం. ఆయన చేసిందే పాత్ర. ప్రదర్శించిందే నటన. ఇండస్ట్రీ మొత్తం ఆయన వెనుక నిలబడింది. ప్రతి అవకాశం ఆయన కోసం క్యూ కట్టింది. ఎంత మార్పు?  కానీ ఈ మార్పు క్షణాల్లో వచ్చింది కాదు.  అందుకు కొన్నేళ్లు పట్టింది. కఠోర శ్రమతో చెమట ధారకట్టింది. పనికి రావన్నవాడే పరిగెత్తుకొచ్చి పనిచ్చే స్థాయికి విధి ఆయన్ని చేర్చింది. ఈరోజు అమితాబ్ బచ్చన్‌ కేవలం పేరు కాదు.. ఓ బ్రాండ్. దేశ విదేశాల్లో ఎంతో మందికి ఆ బ్రాండ్‌ అంటే ఇష్టం.

దశాబ్దాల పాటు బాలీవుడ్‌ని శాసించిన బాద్‌షా

ఒక్కసారి తలెత్తి చూస్తే ఆకాశం సైతం తలవంచి గౌరవించేంత ఔన్నత్యం. అడుగు కిందపెడితే ఆ నట శిఖరం తనపైనే నిలబడిందని పుడమి సైతం పులకరించేంత గొప్పదనం.  గొంతు విప్పితే పిడుగులు కూడా ఉలిక్కిపడేంత గాంభీర్యం. చూపు విసిరితే మెరుపులు సైతం చిన్నబోయేంత తీక్షణత్వం. ఆయనొక డాన్. ఆయనో షెహన్‌షా. దశాబ్దాల పాటు బాలీవుడ్‌ని శాసించిన బాద్‌షా.  నటుడిగా ఆయనది స్వర్ణయుగం.  సినిమాలా.. టీవీ షోలా.. వాణిజ్య ప్రకటనలా.. ఎందులో ఆయన లేరని! ఆయన పేరు వినిపించనిదంటూ ఏదైనా ఉందా! ఆయన చేయలేని పనంటూ కనిపిస్తుందా! నటనకు ప్రాణం పోస్తారు. హోస్ట్ గా గెస్టుల మనసులు దోస్తారు.  అందంగా ఆలపించి మత్తు చల్లుతారు. కవిత్వాన్ని చిలకరించి చిత్తు చేసేస్తారు.  అన్నింటినీ మించి తన వ్యక్తిత్వంలో ప్రతి ఒక్కరినీ కట్టి పడేస్తారు.

గర్వంతో తలెగరేయలేదు

గెలిచిననాడు గర్వంతో తలెగరేయలేదు. ఓడిననాడు ఏమిటిదంటూ కుమిలిపోలేదు. పెద్దవాడంటూ ఎవరినీ నెత్తిన పెట్టుకోలేదు. చిన్నవాడంటూ ఎవరినీ తక్కువ చేయలేదు. ప్రతి అడుగూ అప్రమత్తంగా వేశారు. ప్రతి మలుపునూ అతి జాగ్రత్తగా దాటారు. అందుకే ఎత్తూపల్లాలు ఆయన కెరీర్‌‌ని కానీ, జీవితాన్ని కానీ కుదిపేయలేకపోయారు. ఒడిదుడుకులు ఆయన వేగానికి స్పీడ్ బ్రేకర్లు వేయలేకపోయాయి. పడినా లేచారు. లేచాక మళ్లీ నడిచారు. నడిచి నడిచి పరుగందుకున్నారు. 


వాయువేగంతో దూసుకుపోతూనే ఉన్నారు. అలుపన్నదే లేక పయనించి తీరాలు దాటారు. హద్దుల్ని చెరిపారు.  సప్త సముద్రాల్నీ దాటి వెళ్లి నేల నాలుగు చెరగులా తన కీర్తిని పరిచారు. ఆయన పేరు తెలియనివాళ్లు బహుశా అతి కొద్దిమందేనేమో.

ఎవరూ అందుకోలేని శిఖరం

ఆయనని ఇష్టపడనివాళ్లంటూ అసలు భూమిపై ఉండరేమో. అందమైన పలకరింపు ఆయన వ్యక్తిత్వానికి మణిహారం. చెక్కు చెదరని చిరునవ్వు ఆయన పెదవులకే అలంకారం. నేటికీ ఆయన ఎవరూ అందుకోలేని శిఖరం.  ఆ లెజెండ్‌కి అభిమానులమే అందరం.  ఆయన అందరిలాంటివాడూ కాదు. అందరిలో ఒకడు కాదు.  ఎందరిలోనో ఒకే ఒక్కడు. అందుకే అందరికీ ఇష్టుడు. అమిత్‌జీ.. తుస్సీ గ్రేట్‌ హో.