నాంపల్లి, మల్కాజిగిరి కోర్టులకు బాంబు బెదిరింపు

నాంపల్లి, మల్కాజిగిరి కోర్టులకు బాంబు బెదిరింపు
  • భయంతో పరుగు తీసిన జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బంది 
  • తనిఖీలు చేపట్టి బాంబులు లేవని నిర్ధారించిన పోలీసులు

బషీర్​బాగ్, మల్కాజిగిరి, వెలుగు: నాంపల్లి సిటీ క్రిమినల్ కోర్టు, కుషాయిగూడలోని మల్కాజిగిరి కోర్టుల్లో బాంబులు ఉన్నట్లు గురువారం ఉదయం ఆగంతకుడి నుంచి మెయిల్స్​రావడం కలకలం సృష్టించింది. తాను పాక్ ప్రేరేపిత ఐఎస్ఐ ఉగ్రవాదినని సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలకు బాంబులు పేలుతాయని అందులో పేర్కొన్నాడు. దీంతో జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బంది, జనం భయంతో బయటకు పరుగులు తీశారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం 11.30 గంటలకు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో వచ్చి కోర్టుల్లో అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత బాంబులు లేవని, అవి ఫేక్​మెయిల్స్​అని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో కొన్ని గంటలపాటు కోర్టుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి.