ఔట్ సైడ్ బేసిన్ తరలింపులపై నిషేధం లేదు

ఔట్ సైడ్ బేసిన్ తరలింపులపై నిషేధం లేదు
  • కృష్ణా నుంచి తీసుకెళ్లేందుకు బచావత్ ట్రిబ్యునల్ అనుమతించింది
  • బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు
  • సాగర్ కుడి కాల్వ, కేసీ కెనాల్, కృష్ణా డెల్టా నీళ్లను తరలించుకునేందుకు అనుమతులున్నాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బేసిన్ నుంచి ఔట్​సైడ్ బేసిన్​కు నీళ్ల తరలింపుపై ఎలాంటి నిషేధం లేదని, నీటిని తరలించుకోవచ్చని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్2 (బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ముందు ఏపీ తెలిపింది. బచావత్ ట్రిబ్యునలే అందుకు చట్టబద్ధత కల్పించిందని పేర్కొంది. ఇతర ట్రిబ్యునళ్లు కూడా ఔట్ సైడ్ బేసిన్ తరలింపులకు అనుమతులిచ్చాయని తెలిపింది. కావేరి నదీ జలాలను ఔట్ సైడ్​ బేసిన్​లో ఉన్న బెంగళూరుకు తరలించేందుకు కావేరి ట్రిబ్యునల్, నర్మదా జలాలను ఎడారి ప్రాంతమైన రాజస్థాన్​కు తరలించేందుకు ఆ ట్రిబ్యునల్ ఆమోదం తెలిపాయని వాదించింది. 

గురువారం ట్రిబ్యునల్​లో ఏపీ తరఫున సీనియర్ అడ్వకేట్ జయదీప్ గుప్తా వాదనలు వినిపించారు. బేసిన్​లో ఉన్న ప్రజల ప్రయోజనాలే ముఖ్యం కాదని, మొత్తంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్​ కుడి కాల్వ, కేసీ కెనాల్, కృష్ణా డెల్టా సిస్టమ్స్​కు ఉన్న కేటాయింపుల పరంగా ఔట్​సైడ్ బేసిన్​కు నీటిని తరలించేందుకు బచావత్ ట్రిబ్యునల్ అనుమతించిందని చెప్పారు.

ఆ రాష్ట్రానికి ఆంక్షలున్నయ్​

మహారాష్ట్రలోని కోయ్న, టాటాహైడల్ ప్రాజెక్ట్​లకు సంబంధించి 122 టీఎంసీలను కేటాయించారని, అయితే, అంతకుమించి ఒక్క చుక్క కూడా వాడుకోరాదన్న ఆంక్షలున్నాయని ఏపీ అడ్వొకేట్ జయదీప్ గుప్తా వాదించారు. అలాంటి ఆంక్షలు ఏపీకి లేవన్నారు. విభజనచట్టంలోని 11వ షెడ్యూల్​లోని క్లాజ్​లో నాలుగు ప్రాజెక్టులను ఔట్​సైడ్​ బేసిన్​కు తరలించే ప్రాజెక్టులుగా చూపించారన్నారు. పెన్నా బేసిన్​లో నీటి లభ్యత లేదని, చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో కృష్ణా నీళ్లను ఆ బేసిన్​కు తరలించకుంటే ఆ ప్రాంతమంతా ఎడారిలా మారుతుందన్నారు. 

రాయలసీమ అత్యంత కరువు ప్రాంతమన్నారు. ఆ ప్రాంతానికి కృష్ణా నీళ్లను గ్రావిటీ ద్వారా తీసుకుపోయే వీలుందని, అందుకే ఆ నీళ్లు పంటలకు పారించొచ్చన్నారు. అదే సమయంలో తెలంగాణ ఎత్తైన ప్రాంతంలో ఉంటుందని, కనుక లిఫ్ట్ స్కీమ్స్​ తప్పనిసరి అని వాదించారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 4 (1)లో ఔట్​సైడ్​ బేసిన్ డైవర్షన్ల గురించి ప్రస్తావించారన్నారు. కాగా, తదుపరి వాదనలు జనవరి 21 నుంచి 23 వరకు జరగనున్నాయి. 

సెక్షన్ 3పై విచారణ జనవరికి వాయిదా

తొలుత రాష్ట్రాల వారీ కేటాయింపులపై విచారణ జరిపేందుకు కృష్ణా ట్రిబ్యునల్​ ఇచ్చిన సెక్షన్3 ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్​పై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. తొలుత విభజనచట్టంలోని సెక్షన్ 89 ప్రకారం వాదనలు వినాలని, ట్రిబ్యునల్ ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఏపీ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. కోర్టు ట్రిబ్యునల్​లో జరుగుతున్న వాదనల గురించి ఆరా తీసింది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో విచారణ చేపడతామని చెబుతూ వాయిదా వేసింది.