హైదరాబాద్: దేశంలోని 6 ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, చెన్నై, త్రివేండ్రం, గోవా ఎయిర్ పోర్టులు పేల్చేస్తామని మెయిల్ రావడంతో ఎయిర్ పోర్ట్ అథారిటీ అలర్ట్ అయింది. ఇండిగో ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా ఆఫీసులకు ఈ మెయిల్స్ వచ్చాయని తెలిసింది. ఆరు ఎయిర్ పోర్టుల్లో బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబులు డిటెక్ట్ అవ్వకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కొత్తేమీ కాదు.
చెన్నై విమానాశ్రయానికి అయితే ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకూ 342 బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. వారణాసికి వెళ్లే ఎయిర్ ఇండియా విమానాల్లో ఒక విమానానికి భద్రతా ముప్పు ఉందని, బాంబు పెట్టామని మెయిల్ వచ్చింది. ఈ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణీకులందరినీ దించేశారు. తనిఖీలు చేశారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ పేలుళ్ల ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. బాలానగర్ పీఎస్ పరిధిలో పలు షాపింగ్ మాల్స్, టెంపుల్స్ బస్ స్టాప్స్లో పోలీసుల తనిఖీలు చేశారు. పబ్లిక్ ప్లేస్ల్లో బాంబ్ స్క్వాడ్తో పోలీసులు తనిఖీలు చేశారు.
